
జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలోని ఓ హోటల్ కు వెళ్లారు. హోటల్ లో ఉండటానికి ఒక రూమ్ కావాలని అడిగారు. అయితే ఆ హోటల్ సిబ్బంది అతడిని ఐడీ చూపించాలని కోరారు. దీంతో అతడు తన ఐడీ చూపించారు. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన గుర్తింపు కార్డు ఉండటంతో రూమ్ ఇవ్వడం కుదరదు అని చెప్పారు. ఈ సంభాషణలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఢిల్లీలో యువకుడికి రూమ్ నిరాకరించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన వ్యక్తితో రిసెప్షన్ లోని ఓ మహిళ మాట్లాడుతూ కనిపిస్తోంది. అతడు జమ్మూ కాశ్మీర్ ఐడీ ఆమెకు చూపించడంతో రూమ్ ఇవ్వడం కుదరదు అని ఖరాఖండిగా చెప్పడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రాంతం నుంచి వచ్చే ఐడీలను అంగీకరించవద్దు అని ఢిల్లీ పోలీసులు తమకు చెప్పారని తెలిపారు. ఈ సంభాషణ అంతా అతడు వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
కాశ్మీరీ పండిట్ల వలస నేపథ్యంలో వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ముస్లింలను కించపరిచేలా ఉందని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈ వీడియా వైరల్ గా మారింది. ఈ వీడియోపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. “ ఒక వ్యక్తి తన జమ్మూ కాశ్మీర్ ఐడీ కారణంగా హోటల్ రిజర్వేషన్‌ను తిరస్కరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసుల ఆదేశాల మేరకే రూమ్ ఇవ్వలేదని చెబుతున్నారు. కానీ ఢిల్లీ పోలీసులు అలాంటి దిశానిర్దేశం చేయలేదని స్పష్టం చేస్తున్నాం ’’ అంటూ ట్వీట్ చేశారు. “ వీడియోలో ఉన్న బాధిత వ్యక్తి అదే విషయాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తూ.. తాను అదే ప్రాంతంలో మరో హోటల్ బస చేశానని చెప్పారు. రూమ్ ఇవ్వకపోవడానికి ఆ హోటల్ ఒక కుంటి సాకు మాత్రమే చెప్పిందని తెలిపారు. కొంత మంది నెటిజన్లు ఉద్దేశపూర్వకంగా తప్పుగా చూపి ఢిల్లీ పోలీసుల ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది శిక్షార్హమైన నేరం ” అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఆ వీడియోలో ఎలాంటి తేదీ కనిపించడం లేదు. అయితే ఆ హోటల్ ‘ఓయో రూమ్స్’కు అనుబంధంగా కొనసాగుతోంది. అయితే ఈ వీడియోను జమ్మూ అండ్ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధికార ప్రతినిధి నాసిర్ ఖుహమీ షేర్ చేసిన వెంటనే ఓయో రూమ్స్ తన ప్లాట్‌ఫారమ్ నుండి ఆ హోటల్ ను తొలగించినట్టు ప్రకటించింది.
‘‘ ఇలా జరిగినందుకు మేము భయపడుతున్నాము. మేము వెంటనే మా ప్లాట్‌ఫారమ్ నుంచి హోటల్‌ను తొలగిస్తున్నాం ’’ అంటూ ట్వీట్ చేసింది. ‘‘ మా గదులు, మా హృదయాలు ఎప్పుడూ అందరి కోసం తెరిచి ఉంటాయి. ఇది మేము ఎప్పటికీ రాజీ పడే విషయం కాదు. ఆ వ్యక్తి రూమ్ ఇవ్వడానికి హోటల్ ఎందుకు అలా ప్రవర్తించిందో మేము ఖచ్చితంగా కనుక్కుంటాం. దీనిని మా దీన్ని మా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు ’’ అంటూ పేర్కొంది.