
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్ర సృష్టించింది. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా సాధ్యం కానీ పనిని సుసాధ్యం చేసింది. చంద్రుడిపై ఇంత వరకు ఎవరూ కాలుమోపని దక్షిన ధృవంపై దిగి ఇస్రో రికార్డు నెలకొల్పింది. దీంతో ఇస్రో, భారత్ కు ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
బుధవారం సాయంత్రం భారత కాలమాన ప్రకారం 06.04 గంటలకు చంద్రయాన్ -3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి పై సాఫ్ట్ గా, సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే రేసులో భారత్ విజేతగా నిలిచింది. ల్యాండింగ్ తో మిషన్ కంట్రోల్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. బ్రిక్స్ 15వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. చంద్రయాన్-3 విజయంతం అయిన తరువాత వర్చువల్ గా మాట్లాడారు. ఈ అపూర్వ విజయం సాధించిన ఇస్రోను అభినందించారు. ఇది చారిత్రాత్మకమైన ఉద్యమమని, అభివృద్ధి చెందిన భారత్ కు ఇది పునాది అని అన్నారు.
చంద్రయాన్ -3 మిషన్ లో చివరి 15 నిమిషాలు అంతే కీలకమైనవిగా ఉన్నాయి. మొదటి రఫ్ బ్రేకింగ్ దశ లో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ల్యాండర్ సమాంతర వేగాన్ని సెకనుకు 1,600 మీటర్ల నుంచి తగ్గించారు. రెండో యాటిట్యూడ్ హోల్డింగ్ దశ లో చంద్రుడి ఉపరితలానికి 7.43 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ల్యాండర్ అడ్డంగా నుంచి నిలువుగా వంగి ఎలాంటి భూ ప్రమేయం లేకుండా ప్రయాణించింది. బ్రేకింగ్ దశలో ల్యాండర్ ను 800 మీటర్ల ఎత్తుకు తీసుకువచ్చి చివరి దశకు తరలించారు. టెర్మినల్ డిసెంట్ దశ లో పూర్తిగా వర్టికల్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని సాఫ్ట్ గా తాకింది.
చంద్రయాన్ -1తో చంద్రుడిపై నీటిని కనుగొనాలనే ఇస్రో ఎజెండాతో ప్రారంభమైంది. ఇప్పుడు చంద్రయాన్ -3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడంతో సాకారమైంది. ఈ ప్రాంతంలో గణనీయమైన పరిమాణంలో మంచు ఉంది. ఇది చంద్రుడిపైకి భవిష్యత్తులో క్రూడ్ మిషన్ల కోసం నీరు, ఆక్సిజన్, ఇంధనాన్ని వెలికి తీయడానికి ఉపయోగపడుతుంది. చంద్రయాన్- 3 మిషన్ కోసం సుమారు 54 మంది మహిళా ఇంజనీర్లు / శాస్త్రవేత్తలు నేరుగా రంగంలో పనిచేశారు.
సాయంత్రం 06.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపినప్పటికి అందులో నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు రావడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. రాత్రి 10 గంటల తరువాత రోవర్ బయటకు వచ్చి, తన పని మొదలుపెట్టింది. కాగా.. భారత్ మూన్ మిషన్ విజయవంతమైన నేపథ్యంలో ఇస్రోకు పలు దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు.