పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ అయోధ్యలోని రామ మందిరంపై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఆయన రామ మందిరానికి వెళ్లే భక్తులంతా ముస్లింలుగా తిరిగి వస్తారని అన్నారు.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రామాలన్ని ఆలయాన్ని కించపరిచేలా, దాని ప్రాముఖ్యతను దెబ్బతీసేలా పలు వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ రామ మందిరంపై వివాదాస్పదంగా మాట్లాడిన పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. అందులో రామ మందిరం హిందువులు ఇస్లాం మతంలోకి మారేందుకు దోహదపడుతుందని ఆయన నొక్కి చెప్పారు.
‘‘అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించే హిందువులు ముస్లింలుగా బయటకు వస్తారు. మన మూలాలతో ముడిపడి ఉన్న ప్రదేశాలను సందర్శించేవారిపై మన విశ్వాసం (ఇస్లాం) తన వెలుగును ప్రకాశిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి మోడీ తప్పు చేసి ఉండవచ్చు, కానీ అది మనకు ఒక ఆశీర్వాదంగానే పనిచేస్తుంది. ఇక్కడే ముస్లింలు మళ్లీ ఎదుగుతారు. ఈ విషయంలో అల్లాపై నాకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని మియాందాద్ పేర్కొన్నారు.
Former Captain of the Pakistan Cricket Team, Javed Miandad, claims all Hindus who visit the Bhavya Ram Mandir in Ayodhya will come out as Muslims pic.twitter.com/VtTY4TPyCs
— Sensei Kraken Zero (@YearOfTheKraken)
ప్రధాని మోడీ నిర్వహించిన చారిత్రాత్మక రామ మందిర భూమి పూజ కార్యక్రమం చేపట్టిన మూడు రోజుల తర్వాత మియాందాద్ 2020 ఆగస్టు 8న ఈ వీడియోను అప్లోడ్ చేశారు. అయితే దానికి సంబంధించిన పలు క్లిప్స్ ఇప్పుడు సోసల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి. దాని పూర్తి వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో జరగాల్సిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రెండు నెలల ముందు ఈ వీడియో సోషల్ లో చక్కర్లు కొట్టడం విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. కాగా.. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. దీనికి హాజరుకావాలని ప్రముఖ ఋషులు, ప్రముఖులు, పలువురు భక్తులకు ఆహ్వానాలు అందాయి. ఇదిలా ఉండగా.. అయోధ్యలోని మూడంతస్తుల రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఇటీవల ధృవీకరించారు.