
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విరుచుకుపడ్డారు. ఈ తరుణంలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. డీఎంకే నాయకుడి ప్రకటనకు కాంగ్రెస్ దూరం కాకపోతే.. కాంగ్రెస్ పట్ల సామాన్య ప్రజానీకానికి హిందూ వ్యతిరేక భావన ఏర్పడుతుందని ఆయన అన్నారు. తమిళనాడు మంత్రి ప్రకటనను తాను ఖండించకూడదనుకుంటున్నానని, ఎందుకంటే అతను తనను తాను బయటపెట్టుకున్నాడని అన్నారు.
ఈ సందర్భంగా.. ఉదయనిధి స్టాలిన్ ప్రకటన కార్తీ చిదంబరం, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేల ప్రకటనలతో సరిపోలుతుందని అస్సాం సీఎం పేర్కొన్నారు. డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని చిదంబరంపై చర్యలు తీసుకుంటుందా? అని ముఖ్యమంత్రి శర్మ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఇదో పరీక్ష అని అన్నారు. ఆయన సనాతన ధర్మాన్ని గౌరవిస్తారో? లేదో? ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
అసలేం జరిగింది?
సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. దోమలను, వైరస్ ను నిర్మూలించినట్లే.. సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఉదయనిధి శనివారం వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు.
విపక్షాల కూటమిపై అమిత్ షా
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి ప్రకటనపై రాజకీయ దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఉదయనిధి ప్రకటనపై బీజేపీ మొత్తం దాడిని ప్రారంభించింది. దానిని ద్వేషపూరిత ప్రసంగంగా పేర్కొంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇండియా కూటమి ఎలాంటి దుర్మాగానికై పాల్పడుతోందని అమిత్ షా అన్నారు. సనాతన ధర్మం గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే.. అంతా ప్రమాదంలో పడుతారని అన్నారు.
ఉదయనిధిపై ఫిర్యాదు
అదే సమయంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయనిధి తన ప్రసంగంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అవమానకరమైన, రెచ్చగొట్టే ప్రకటనలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.