
దురాక్రమణ కాంక్షతో పొరుగు దేశం చైనా కుట్రలు చేస్తూనే ఉన్నది. భారత్‌లోని సున్నితమైన ఈశాన్య ప్రాంతాల్లోకి చొరబడేందుకు గత ఆరు దశాబ్దాలుగా నానా దుర్చర్యలను పాల్పడుతూనే ఉంది. ముఖ్యంగా గత ఐదేండ్లలో డ్రాగన్ దేశం ఆగడాలు మితిమీరిపోయాయి. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ సరిహద్దుల్లో గ్రామాల నిర్మాణం, మన ప్రాంతాల పేర్లు మార్చడం వంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పలుమార్లు హద్దు మీరింది. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ వస్తుంది.
తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేరు మార్చడానికి ప్రయత్నించిన చైనాకు భారత్ గట్టి సమాధానమిచ్చింది. హిమాలయ ప్రాంతానికి చెందిన అగ్రశ్రేణి బౌద్ధ మత పెద్దలతో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లా జెమితాంగ్‌లోని గోర్సం స్థూపం వద్ద నలంద బౌద్ధ సమావేశం నిర్వహించింది. ఈ సదస్సులో దాదాపు 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పెమా ఖండూ మాట్లాడుతూ.. శాంతియుత సహజీవనంతో విరాజిల్లుతున్న బౌద్ధ సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో గణనీయమైన స్థాయిలో బౌద్ధ జనాభా ఉందని, అదృష్టవశాత్తూ వారు తమ సంస్కృతి, సంప్రదాయాలను మతపరమైన ఉత్సాహంతో కాపాడుకున్నారని ఖండూ చెప్పారు. నలంద బౌద్ధ సంప్రదాయంపై జాతీయ సదస్సును నిర్వహించినందుకు నలంద బౌద్ధ సంప్రదాయానికి చెందిన భారతీయ హిమాలయన్ కౌన్సిల్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 14వ దలైలామా జెమితాంగ్ ద్వారా భారతదేశానికి వచ్చారు.
ఈ పరోక్షంగా ఈ కార్యక్రమం ద్వారా భారత్ .. చైనాకు వార్నింగ్ ఇచ్చిందనే చెప్పాలి. అరుణాచల్‌లోని 11 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టింది. ఈ పేర్లు చైనా, టిబెట్, పిన్‌యిన్ భాషల్లో ఉన్నాయి. పేర్ల మార్పు జాబితాలో రెండు భూభాగాలు, రెండు నివాస ప్రాంతాలు, ఐదు పర్వతాలు, రెండు నదులు కూడా ఉన్నాయి. ఈ చర్యను కేంద్రం తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ భారత్‌లో అంతర్భాగమని అంతర్జాతీయ వేదికగా స్పష్టం చేసింది. కొత్త పేర్లు పెట్టడం వల్ల వాస్తవాలు మార్చలేని హెచ్చరించింది.