100 మీటర్ల లోయలో పడ్డ ట్రక్కు.. చిన్నారితో సహా ఐదుగురు మృతి

By Rajesh KarampooriFirst Published May 14, 2023, 11:23 PM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా ధర్మశాల సమీపంలోఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారితో సహా ఐదుగురు మరణించారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని ధర్మశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ట్రక్కు 100 మీటర్ల లోతైన లోయలో పడింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ట్రక్కు బోల్తా పడడంతో ఐదుగురు మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులున్నారు. అదే సమయంలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. చాలా మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం రాసెహర్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఏఎస్పీ హితేష్ లఖన్‌పాల్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉతాదగ్రన్ పంచాయతీ సమీపంలోని అప్రోచ్ రోడ్డు వెంబడి గోధుమలతో కూడిన ట్రక్ లోయలో పడిపోయింది. ఈ ఘటన సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో జరిగింది. ట్రక్కులో డ్రైవర్‌,చిన్నారులు సహా 10 మంది ఉన్నారు. మృతుల్లో సీతాదేవి (39),సునీల్ కాంత్ (43), కృష్ణ (7) మిలాప్ చంద్ (డ్రైవర్), ఆర్తీదేవి (45) ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రియా (7), అన్షు (7), అభినవ్ (17), సాక్షి (17), అనిల్ కాంత్ (40)‌లకు గాయాలయ్యాయి. మృతులంతా ఉతాదగ్రన్ వాసులు. జిల్లా కలెక్టర్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), పోలీసు సిబ్బంది బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులు తండా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలంలో యోల్ పోలీస్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ నారాయణ్ సింగ్, తహసీల్దార్ గిరిరాజ్ ఠాకూర్ ఉన్నారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.25వేలు అందించింది.

click me!