Latest Videos

హిజాబ్ ఆటంకం కాదు.. తొలి ప్రయత్నంలో నీట్ క్రాక్ చేసిన ట్విన్ సిస్టర్లు

By Asianet NewsFirst Published Jun 16, 2023, 3:26 PM IST
Highlights

హిజాబ్ ధరించిన మసీద్ ఇమామ్ కవల పిల్లలు జమ్ము కశ్మీర్ లోయలో సంచలనం సృష్టించారు. మద్రాసా విద్య, హిజాబ్ వంటివేవీ వారి విజయానికి ఆటంకాలుగా మారలేవు. ఆ ఇద్దరు ట్విన్ సిస్టర్లు తొలి ప్రయత్నంలోనే నీట్ పరీక్షను క్లియర్ చేశారు.
 

శ్రీనగర్: కశ్మీర్‌లో గ్రామీణ ప్రాంతంలోని మసీదులో ఇమామ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సయ్యద్ సాజాద్ కూతుళ్లు సంచలనం సృష్టించారు. మెడికల్ కాలేజీ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ అయిన నీట్‌ను తొలి ప్రయత్నంలోనే క్రాక్ చేశారు. హిజాబ్ గానీ, మద్రాసా విద్య గానీ వారి విజయానికి ఆటంకంగా మారలేదు. తొలి ప్రయత్నంలో ఆ ఇద్దరు కవల సోదరీమణులు నీట్ పరీక్ష క్లియర్ చేశారు.

దక్షిణ కశ్మీర్ కుల్గాం జిల్లాలోని వట్టో గ్రామానికి చెందిన ఇమామ్ సయ్యద్ సాజద్‌కు ఇద్దరు కవల కూతుళ్లు సయ్యద్ తబియా, సయ్యద్ బిస్మా. వారి కుటుంబం మసీదులో కేటాయించిన చిన్న క్వార్టర్‌లోనే జీవిస్తున్నారు. 

దేశవ్యాప్తంగా మసీదుల్లో కనిపించే సాదాసీదా ఇమామ్‌లాగే సయ్యద్ సాజాద్ కూడా ఉంటాడు. సంపాదన పరిమితింగానే ఉంటుంది. మతపరమైన విద్యే ఎక్కువ. ఆంగ్ల భాష, ఆధునిక విద్యపై పెద్దగా అవగాహన లేదు. అయినా.. తన బిడ్డలను క్రమశిక్షణగా చదివించి విజయపథంలో నడిపించాడు.

ఆవాజ్ ది వాయిస్ ఇమామ్ సయ్యద్ సాజాద్‌ను పలకరించగా భావోద్వేగానికి గురయ్యాడు. తన ప్రార్థనలను ఆ అల్లా విన్నాడని సంబురపడిపోయాడు. తన బిడ్డలు మెడికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత సమాజంలోని బలహీనులను సేవ చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.

సయ్యద్ సాజాద్ నివసించే వట్టో గ్రామం మారుమూల ప్రాంతం. అక్కడ ఇంటర్నెట్ అంతరాయం లేకుండా రావడమే గొప్ప. కానీ, నేడు నీట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధులు కావాలంటే ఇంటర్నెట్  ఎంతో ముఖ్యం.

తన బిడ్డల చదువుల కోసం తాను చాలా మందితో చర్చించానని, మంచి సలహాలు వచ్చినప్పుడు వాటితో బిడ్డలకు టార్గెట్‌లు పెట్టానని వివరించాడు. పలు కోచింగ్ సెంటర్‌ల గురించి సమాచారం, రాసిన కాగితాలు సేకరించేవాడని, తద్వార తన బిడ్డలు ఇంకా చదవాలనే ఆసక్తి పెంచేలా చేశానని చెప్పాడు.

తబియా, బిస్మాలు 12వ తరగతి పరీక్ష పాస్ అయిన తర్వాత శ్రీనగర్‌లో ప్రముఖ కోచింగ్ సెంటర్ మిషన్ఈలో అడ్మిషన్ పొందడానికి ఒకరు సహాయం చేశారని వివరించారు.

Also Read: భారత్ నా దేశం; ఇస్లాం నా మతం

బిస్మా మాట్లాడుతూ.. తమకు సరైన గైడెన్స్, ప్రోత్సాహం ఉంటే చాలని చెప్పారు. తాము అందుకోసమే ఎదురుచూస్తున్న తరుణంలో తండ్రి అందించాడని, తమను మిషన్ఈ కి తీసుకెళ్లడం తమ జీవితంలో జరిగిన గొప్ప పరిణామం అని తెలిపారు. అక్కడ ప్రతి ఒక్కరూ తమతో స్నేహపూర్వకంగా మెలిగారని, తమలో పుష్టిగా ప్రతిభ ఉన్నదని నమ్మేలా బోధకులు నడుచుకున్నారని వివరించారు.

డాక్టర్ల కోసం తమకు అడ్మిషన్లు పొందుతామని తాము ఊహించనేలేదని తబియా అన్నారు. తమకు ఉన్న పరిమిత వనరుల నుంచి తల్లిదండ్రుల అన్ని రకాల సహాయ, సహకారాలు అందించారని వివరించారు. 

తండ్రి ఇమామ్, హిజాబ్ ధరించడం, దీని- తలీమ్‌లో విద్య చదవడం గురించి ప్రస్తావించగా.. ఇవేవీ తమకు ఆటంకాలుగా అనిపించలేవని ఆ ట్విన్ సిస్టర్లు అన్నారు. ఇస్లామిక్ విధానంలో పెంచడం ద్వారా తమకు క్రమశిక్షణ, జీవితంపై గురి ఏర్పడ్డాయని గర్వంగా తెలిపారు.

ఈ ట్విన్ సిస్టర్ల విజయం గురించి బయటకు తెలియగానే మీడియా ప్రతినిధులు ఇంటి ముందు క్యూ కట్టారు. వారి ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు.

ఈ ట్విన్ సిస్టర్ల విజయం కశ్మీర్ లోయలోని మరెందరో విద్యార్థినీ, విద్యార్థులకు ప్రేరణగా ఉంటుందని ఓ ఆన్‌లైన్ పోర్టల్ పేర్కొంది. కృషి, పట్టుదల, సరైన గైడెన్స్ ఉంటే ఎలాంటి అవాంతరాలైనా ఎదుర్కొని  విజయం సాధించగలరని వీరు నిరూపించారని తెలిపింది. 

 

---- మొదస్సిర్ అష్రాఫీ (ఆవాజ్ ది వాయిస్ నుంచి.. )

click me!