
కర్ణాటకలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమకు అడ్డుగా వున్నాడన్న కోపంతో విధుల్లో వున్న పోలీస్ కానిస్టేబుల్‌ను దారుణంగా హతమార్చింది. కలబురగి జిల్లా జేవర్గి తాలూకా నారాయణపురా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గురువారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు తెలుసుకున్న నేలగి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే మయూరు (51) అనే కానిస్టేబుల్ వారిని అడ్డుకునేందుకు యత్నించాడు. అయితే ట్రక్కు డ్రైవర్ దానిని మయూర మీదుగా నడిపాడు. దీంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న మిగిలిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు సిద్ధన్నపై కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఓ ప్రైవేట్ వ్యక్తికి చెందిన ఇసుక నిల్వ వుంది. అక్కడే ప్రభుత్వానికి చెందిన కొంత ఇసుక కూడా వుంది. అయితే ఇసుక మాఫియా ప్రభుత్వానికి చెందిన ఇసుకను కూడా తవ్వేస్తున్నట్లుగా ఫిర్యాదు రావడంతో మయూర ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహింస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇసుక ట్రక్కును అడ్డుకునే యత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరడంతో మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పోలీసులను ఆదేశించారు. మయూర హత్యపై విచారణకు సైతం ఆదేశించారు.