
కర్ణాటక (karnataka) రాష్ట్రం ఉడిపిలోని ప్రభుత్వ కాలేజీకి చెందిన ముస్లిం స్టూడెంట్లు తరగతి గదిలో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు (high court) మంగళవారం కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. అయితే ఈ కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పును కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (central minister pralhad joshi) మాట్లాడుతూ.. ‘‘ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. రాష్ట్రం, దేశం ముందుకు సాగాలని కోరుతున్నాను. ప్రతీ ఒక్కరూ హైకోర్టు ఆదేశాలను అంగీకరించి శాంతిని కాపాడాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యార్థుల ప్రాథమిక విధి చదువు అని, కాబట్టి అన్ని విషయాలను పక్కనబెట్టి చదువుకొని ఐక్యంగా ఉండాలి ’’ అని ఆయన చెప్పారు.
కర్ణాటక హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ ‘‘ ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ ప్రకారం మతపరమైన ఆచారంలో భాగం కాదని మేము భావిస్తున్నాము ’’ అంటూ తెలిపింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తీ (Chief Justice Ritu Raj Awasthi) ఈ తీర్పును వెలువరించారు. ప్యానెల్‌లోని మరో ఇద్దరు న్యాయమూర్తులుగా జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ (Krishna S Dixit) , జస్టిస్ జెఎం ఖాజీ (J M Khazi) ఉన్నారు. స్కూల్ యూనిఫాం విధానం అనేది ఒక సహేతుకమైన పరిమితి మాత్రమేనని తెలిపారు. ఇది రాజ్యాంగబద్ధంగా అనుమతించదగినదని తెలిపారు. దీనిని విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరని కోర్టులోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
ఫిబ్రవరి 5వ తేదీ నాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును సహేతుకమైనదేనని, ప్రభుత్వానికి ఆ అధికారం ఉందని తెలిపింది. ఈ ఉత్తర్వు ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో సమానత్వం, సమగ్రత, పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించే దుస్తులు ధరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. కాలేజీ, ప్రిన్సిపాల్, టీచర్‌పై క్రమశిక్షణా విచారణ చేపట్టాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది.
ఈ ఏడాది జనవరి 1వ తేదీన కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న ప్రభుత్వ కాలేజీలో ఈ హిజాబ్ (hijab)వివాదం మొదలైంది. ఆరుగురు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి క్లాసులకు హాజరయ్యారు. దీనిని కాలేజీ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. దీంతో ఈ వివాదం మొదలైంది. ముస్లిం బాలికల హిజాబ్ ధరించి రావడంతో కొంత మంది హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి క్లాసులకు రావడం మొదలు పెట్టింది. దీంతో రెండు ఉడిపిలో వర్గాల మధ్య మొదలైన ఈ సమస్య రాష్ట్రం మొత్తం వ్యాపించింది. ఇది పెద్ద ఆందోళనకు దారి తీసింది. ఈ విషయంలో ఆ స్టూడెంట్లు ఫిబ్రవరి 9న హైకోర్టుకు వెళ్లారు. హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
హిజాబ్ వివాదంపై ముస్లిం విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి విచారించింది. విచారణ సమయంలోనే ఆందోళనల కారణంగా మూతపడిన విద్యాసంస్థలను తిరిగి తెరవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు క్లాస్ రూమ్‌లో హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించడాన్ని కూడా కోర్టు నిషేధించింది. హిజాబ్ వివాదంపై 11 రోజుల పాటు రెగ్యులర్ గా హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈ తీర్పు వెలవడే వారం రోజుల ముందు నుంచి బెంగళూరు వంటి ముఖ్య పట్టణాల్లో పెద్ద సమావేశాలను కర్ణాటక ప్రభుత్వం నిషేదించింది. తీర్పు నేపథ్యంలో బెంగళూరు పట్టణంలో 144 సెక్షన్ విధించింది. ఈ రోజు ఉడిపి, శివమొగ్గ ప్రాంతాల్లో స్కూల్స్ ను, కాలేజీలను మూసివేశారు.