
Karnataka education minister BC Nagesh: కర్నాటక లో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పరీక్షలు రాసే విద్యార్థులు హిజాబ్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, పరీక్షల సమయంలో హిజాబ్ కు అనుమతి లేదని కర్నాటక విద్యాశాఖ మంత్రి బీసీ.నగేష్ తేల్చిచెప్పారు. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలలు, పీయూ కళాశాలల్లో హిజాబ్ పై నిషేధానికి నిరసనగా పీయూసీ పరీక్షకు గైర్హాజరై ఏడాది నష్టపోయే పరిస్థితుల్లో ఉన్న ముస్లిం మహిళా ప్రీ-యూనివర్శిటీ విద్యార్థులకు సుప్రీంకోర్టులోనూ నిరాశే ఎదురైంది. హిజాబ్ పిటిషన్ ను అత్యవసరంగా లిస్టింగ్ చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించడంతో ప్రస్తుత విద్యాసంవత్సరాన్ని పరీక్షలకు రాయడానికి రాని విద్యార్థులు కోల్పోయే అవకాశముంది.
వివరాల్లోకెళ్తే..మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న రెండో ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) పరీక్షలకు హిజాబ్ ధరించిన విద్యార్థులను అనుమతించబోమని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ తెలిపారు. గత ఏడాది మాదిరిగానే విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫాం ధరించి పరీక్ష రాయాలన్నారు. "హిజాబ్ ధరించిన విద్యార్థులను పరీక్ష రాయడానికి అనుమతించరు. నిబంధనలు పాటించాలి. విద్యా సంస్థలు, ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నాయని" నగేష్ తెలిపారు. హిజాబ్ నిషేధం తర్వాత పరీక్షలకు హాజరైన ముస్లిం విద్యార్థుల సంఖ్య మెరుగుపడిందనీ, అయితే తన వాదనలను ధృవీకరించడానికి ఖచ్చితమైన సంఖ్యలను ప్రస్తుతం అందించలేమని మంత్రి చెప్పారు.
హిజాబ్ నిషేధం తర్వాత ఎక్కువ మంది ముస్లిం సోదరీమణులు పరీక్షలకు హాజరయ్యారనీ, ఇప్పుడు ఎక్కువ మంది ముస్లిం బాలికలు హిజాబ్ లేకుండానే పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. హిజాబ్ వివాదం తర్వాత.. పరీక్షలకు హాజరైన ముస్లిం సోదరీమణుల సంఖ్య, వారి నమోదు నిష్పత్తి పెరిగినట్లు తమ గణాంకాలు చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విద్యార్థులు హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరయ్యేలా కర్ణాటకలోని ప్రభుత్వ సంస్థలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. మార్చి 9 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు ప్రారంభం కానుండటంతో బాలికలు మరో విద్యాసంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందనీ, దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఓ న్యాయవాది కోరడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లారు. సీజేఐ తాను పరిశీలిస్తానని తెలిపారు. కాగా, సుప్రీంకోర్టు మార్చి 6 న హోలీ విరామం సెలవులతో తిరిగి మార్చి 13 న తిరిగి తెరవబడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అంతకుముందు హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 2022 మార్చి 15న జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 129 పేజీల తీర్పును వెలువరించింది. హిజాబ్ ధరించి తరగతికి రాకుండా అడ్డుకున్న ఎనిమిది మంది ముస్లిం విద్యార్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పు వెలువడింది. విభిన్న అభిప్రయాలు వ్యక్తకావడంతో మరో ధర్మాసనం ముందుకు కేసును బదిలీ అంశం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. జనవరి 1, 2022 న, కళాశాల అభివృద్ధి మండలి (సీడీసీ) కళాశాల / పాఠశాల ప్రాంగణాలలో హిజాబ్ ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కళాశాల భవనం వెలుపల, క్యాంపస్ లోపల విద్యార్థుల నిరసనలకు కారణమైంది. తరగతి గదుల్లోకి హిజాబ్ ను అనుమతించలేదని కళాశాల అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించడంతో కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి నిరసనలు చేపట్టడంతో వివాదం మరింతగా ముదిరింది.