కేరళ అయిపోయింది.. ఇక ఢిల్లీ వంతు

By ramya neerukondaFirst Published Aug 28, 2018, 2:09 PM IST
Highlights

ఢిల్లీ రోడ్లు స్విమ్మింగ్‌ పూల్స్‌గా మారిపోయాయి’ అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తూ ఫొటోలు షేర్‌ చేస్తున్నారు.
 

మొన్నటిదాకా కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని పట్టుకున్నాయి. మంగళవారం ఢిల్లీ లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా ఢిల్లీలోని చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది.

 ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గురుగ్రామ్‌లో భారీ వర్షంతో పాటు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాఠశాలలకు సెలవు ఇచ్చారు.

ఢిల్లీ విమానాశ్రయం, సెంట్రల్‌ దిల్లీ, ఆర్కే పురం, తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. తెల్లవారుజామున 3గంటల నుంచి 4గంటల మధ్య కుండపోత వాన కురిసింది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాలు నీళ్లతో నిండిపోయాయి. 
ప్రజలు వాతావరణ శాఖ ఇస్తున్న హెచ్చరికలతో పాటు జలమయమైన ప్రాంతాల ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ‘ఇంత పెద్ద పెద్ద ఉరుములు నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ వినలేదు. ఢిల్లీలో చాలా పెద్ద వర్షం పడుతోంది’, ‘ఇవాళ కురుస్తున్న వర్షం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. రోడ్లు, ఇళ్లు కూడా నీటిలో మునిగిపోయాయి’, ‘ఢిల్లీ రోడ్లు స్విమ్మింగ్‌ పూల్స్‌గా మారిపోయాయి’ అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తూ ఫొటోలు షేర్‌ చేస్తున్నారు.
 

click me!