ప్రియుణ్ణి మతం మారమంది... మనసు మార్చుకుంది

By sivanagaprasad KodatiFirst Published Aug 28, 2018, 11:08 AM IST
Highlights

వేరే మతం అబ్బాయిని ప్రేమించిన యువతి ఇంట్లో వాళ్లకి నచ్చజెప్పడానికి ఆ యువకుడిని మతం మార్చుకుని చెప్పింది.. తీరా అతను మతం మార్చుకున్నాకా ఆ యువతి మనసు మార్చుకుని తల్లిదండ్రులతో ఉండటానికే ఇష్టపడింది

వేరే మతం అబ్బాయిని ప్రేమించిన యువతి ఇంట్లో వాళ్లకి నచ్చజెప్పడానికి ఆ యువకుడిని మతం మార్చుకుని చెప్పింది.. తీరా అతను మతం మార్చుకున్నాకా ఆ యువతి మనసు మార్చుకుని తల్లిదండ్రులతో ఉండటానికే ఇష్టపడింది. ఇప్పుడు ఈ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానం వద్ద విచారణకు వచ్చింది.

వివరాల్లోకి వెళితే... ఛత్తీస్‌గఢ్‌కి చెందిన అంజలి జైన్, మహ్మద్ ఇబ్రహీం సిద్ధిఖిలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.. అయితే ఇరువురి మతాలు వేరుకావడంతో... వేరే మతస్తున్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని.. అందువల్ల సిద్ధిఖిని మతం మారాల్సిందిగా అంజలి కోరింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 23న సిద్ధిఖి ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారాడు. మహ్మద్ సిద్ధిఖి కాస్తా ఆర్యన్ ఆర్యగా పేరు మార్చుకున్నాడు..

అనంతరం వీరిద్దరూ ఫిబ్రవరి 25న హిందూ సంప్రదాయం ప్రకారం ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తమ వివాహం గురించి అంజలి ఇంట్లో వాళ్లకు చెబుతానని చెప్పడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత జూన్‌లో అంజలి తమ ప్రేమ, వివాహం గురించి తల్లిదండ్రులకు చెప్పి.. భర్త వద్దకు వచ్చేసింది. అయితే అంజలి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి మహిళా పోలీసులకు అప్పగించారు. దీనిపై సిద్ధిఖి హైకోర్టును ఆశ్రయించాడు.

పోలీసులు తన భార్యను తన నుంచి దూరం చేశారని... ఆమెను తనకు చూపాల్సిందిగా కోరాడు.. అదే సమయంలో అంజలి మేనమామ.. సిద్ధిఖికి ఇంతకు ముందే వివాహం అయ్యిందని తెలిపాడు. అందువల్ల అంజలిని అతనితో పంపలేమని కోర్టుకు వివరించాడు.. దీనిపై స్పందించిన సిద్ధిఖి తనకు గతంలోనే వివాహం అయిన మాట వాస్తవమేనని... కానీ ఇప్పుడు విడాకులు తీసుకున్నానని... ఈ విషయం అంజలికి కూడా తెలుసునని కనుక ఆమెను తనతో పంపాల్సిందిగా కోరాడు.

వీరి వాదనలు విన్న హైకోర్టు అంజలి తల్లిదండ్రులతోనైనా ఉండవచ్చు.. లేదంటే ప్రభుత్వ వసతి గృహంలోనైనా ఉండవచ్చని తీర్పునిచ్చింది. దీనిపై సిద్ధిఖి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీం విచారణనకు హాజరైన అంజలి తాను తల్లిదండ్రులతో కలిసి ఉండాలనుకుంటున్నానని.. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని తెలిపింది.

ఆమె మేజర్ అయినందున తన ఇష్టం ప్రకారం తల్లిదండ్రులకే అప్పగించాలని సుప్రీం పోలీసులను ఆదేశించింది. ఈ తీర్పుతో దిగ్భ్రాంతికి గురైన సిద్ధిఖి ‘‘ తనను దక్కించుకోవడానికి తాను మతం మార్చుకున్నానని.. కానీ ఆమె తన తల్లిదండ్రుల కోసం మనసు మార్చుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు..

click me!