
Haryana’s Nuh violence: హర్యానాలోని నుహ్, గురుగ్రామ్ లలో ఇటీవల జరిగిన హింసాకాండలో ఆరుగురు మరణించగా, ఆదాపు 116 మంది గాయపడిన నేపథ్యంలో చెలరేగిన మతపరమైన ఉద్రిక్తతల మంటలను ఆర్పడానికి ప్రజలు, నాయకులు శాంతి కోసం పిలుపునిచ్చారు. అజ్మీర్ షరీఫ్ దర్గా ఆధ్యాత్మిక అధిపతి, ప్రముఖ సూఫీ సన్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ మనుమడు సయ్యద్ జైనులాబ్దీన్ చిస్తీ మాట్లాడుతూ దేశాన్ని చుట్టుముట్టి యువతరానికి హాని కలిగించే ద్వేషం, మతతత్వ విషాన్ని రూపుమాపేందుకు దేశ ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హర్యానాలో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. "శాంతి కోసం బాధ్యతతో పనిచేయాలని హర్యానాలోని అన్ని మతాలు, వర్గాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని చిస్తీ అన్నారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు వివిధ మతాలకు చెందిన బాధ్యతాయుతమైన ప్రజలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
భావోద్వేగాలను రెచ్చగొట్టకుండా శాంతికి దారితీసే విధంగా మాట్లాడాలని ఆయన నేతలకు విజ్ఞప్తి చేశారు. తమ రాజకీయాలు దేశం కంటే గొప్పవి కావని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. మనది దేశం.. శాంతి కోసం ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు కృషి చేయాలన్నారు. దేశంలో ఐక్యత, సమగ్రత, శాంతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ముందుకు సాగాలన్నారు. హర్యానాలో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో శాంతి, జాతీయ ఐక్యత కోసం పంజాబ్ కు చెందిన అనేక మంది ముస్లిం నేతలు విజ్ఞప్తి చేశారు.
హర్యానాలో జరిగిన ఘటనలను అందరూ ఖండించాలని పంజాబ్ లోని అతిపెద్ద మసీదు షాహి ఇమామ్ మౌలానా మొహమ్మద్ ఉస్మాన్ రహ్మానీ అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ శాంతి, సామరస్యాలను కాపాడాలని ఆయన ప్రజలను కోరారు. అల్లర్లు చేసేవారికి, దుష్ట శక్తులకు మతం లేదనీ, నుహ్ లో మాదిరిగానే తమ ప్రయోజనాల కోసం వాతావరణాన్ని చెడగొట్టడమే వారి లక్ష్యంగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. నిందితులను ప్రభుత్వం వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని షాహీ ఇమామ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా నేరుగా జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇస్లాం అన్ని మతాల పట్ల ప్రేమను బోధిస్తుంది తప్ప ద్వేషాన్ని కాదని షాహీ ఇమామ్ అన్నారు. నూహ్ హింసాకాండపై పంజాబ్ లో ముస్లింలు ఆందోళనలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అల్లర్లలో అమరుడైన మౌల్వీ సాహిబ్ ప్రాణాలు కోల్పోయినందుకు ప్రజలు సంతాపం తెలపాలని, కానీ ద్వేషం అనే ఒక్క నినాదం ఆయన స్మృతిని అవమానించడమే అవుతుందన్నారు.
జామియత్ ఉల్మహే-హింద్, వునా మసీదుకు చెందిన సర్దార్ మొహమ్మద్ మజార్ ఆలం కూడా ప్రజలు శాంతిని కాపాడాలని, అల్లర్లు విధ్వంసం తప్ప మరేమీ ఇవ్వవని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. శాంతియే ఇస్లాంకు పునాది అన్నారు. హింసను నివారించడంలో హర్యానా పోలీసులు విఫలమయ్యారనీ, ఇప్పుడు కేంద్రమే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అల్లర్లలో గురుగ్రామ్ కు చెందిన మౌలానా సాద్ మృతి చెందడాన్ని అందరూ ఖండించాలని ఆయన అన్నారు. ఏ మతం లేదా వర్గానికి చెందిన వ్యక్తి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని మజార్ ఆలం అన్నారు. గుర్గావ్ లోని సెక్టార్ 57లోని మసీదుపై దాడి చేయడం, మౌల్వీని చంపడం ఏ హిందువు పని కాదని మేధావి, పలు పుస్తకాల రచయిత మౌలానా అన్వర్ అమృత్ సర్ అన్నారు. శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలనుకునే దుర్మార్గులు మాత్రమే ఇలా చేయగలరని ఆయన అన్నారు. అయితే మెజారిటీ భారతీయుల ఐక్యతకు వ్యతిరేకంగా ఇలాంటి శక్తులు విజయం సాధించలేవని హెచ్చరించారు.
"ఆ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు సోదరభావంతో జీవించారు. అవి ఘర్షణలు, విభేదాలు కొన్ని అవకతవకలు కావచ్చు, కానీ ఈసారి పెద్ద వివాదం లేదా సమస్య లేదు" అని ఆయన చెప్పారు, నూహ్ హింస ఒక కుట్రగా కనిపిస్తోందనీ, ప్రభుత్వం దీని వెనుక ఉన్నవారిని బహిర్గతం చేయాలన్నారు. పంజాబ్ ప్రజలు శాంతి కోసం ప్రార్థిస్తున్నారని చెప్పారు. పంజాబ్ ఆల్ ఇండియా జమాత్-ఎ-సాల్మానీ ట్రస్ట్ అధిపతి హాజీ అబిద్ హసన్ సాల్మానీ దక్షిణ హర్యానాలో హింసాత్మక సంఘటనలను ఖండించారు. హిందూ-ముస్లిం ఐక్యతతో కలత చెందుతున్న దుష్ట శక్తులే దీనికి కారణమని పేర్కొన్నారు. హిందువులు, ముస్లింలను విడగొట్టాలని చూస్తున్న వారికి హింసలో అందరూ నష్టపోతారనే ఆలోచన లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ శాంతిని కాపాడాలని సల్మానీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జలంధర్ లోని ఇమామ్ నాసిర్ మసీదుకు చెందిన మౌలానా షంషాద్ కూడా శాంతి కోసం ఇదే విధమైన విజ్ఞప్తి చేశారు. ఇమామ్ నాసిర్ మసీదు కమిటీ చైర్మన్ నాసిర్, ఇమామ్ నాసిర్ దర్గాకు చెందిన మౌలానా అహ్మద్ మాట్లాడుతూ ప్రజలు శాంతి కోసం ప్రార్థించాలని కోరారు. వదంతులను ప్రజలు పట్టించుకోవద్దన్నారు.
(ఆవాజ్ ది వాయిస్ సౌజన్యంతో..)