కోవిడ్ తర్వాత తొలి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ.. ఎక్కడికో తెలుసా..?

By Siva KodatiFirst Published Mar 25, 2021, 9:17 PM IST
Highlights

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత విదేశాంగ విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. ఎన్నో దేశాలను చుట్టువచ్చిన ఆయన.. అంతర్జాతీయ సమాజంలో భారతదేశ పలుకుబడిని పెంచారు. అయితే గతేడాది కోవిడ్ కారణంగా ప్రధాని విదేశీ యాత్రలకు బ్రేక్ పడింది

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత విదేశాంగ విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. ఎన్నో దేశాలను చుట్టువచ్చిన ఆయన.. అంతర్జాతీయ సమాజంలో భారతదేశ పలుకుబడిని పెంచారు.

అయితే గతేడాది కోవిడ్ కారణంగా ప్రధాని విదేశీ యాత్రలకు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మోడీ మళ్లీ పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

కరోనా ప్రారంభమైన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రధాని వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటనకు ఆయన వెళ్లనున్నారు.

ఈ నెల 26, 27 తేదీల్లో అక్కడ పర్యటించనున్నట్టు మోడీ పేర్కొన్నారు. కరోనా అనంతరం తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లడం, అందులోనూ మిత్రదేశమై బంగ్లాదేశ్‌కు వెళ్లడం సంతోషంగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఎంతో గాఢమైన సాంస్కృతిక, భాషా సంబంధాలు ఉన్నాయని మోడీ పేర్కొన్నారు.

శుక్రవారం బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్టు ప్రధాని తెలిపారు. దీంతో పాటు బంగబంధు షేక్ ముజిబుర్‌ రెహ్మాన్‌ శతజయంతి వేడుకలు కూడా ప్రారంభం కానున్నాయని చెప్పారు.

గత శతాబ్దంలో  రెహ్మాన్ ఓ మహోన్నత నేతగా మోడీ కొనియాడారు. ముజిబుర్‌ ఆలోచనలు, జీవితం కోట్లాది మందికి ప్రేరణగా నిలిచాయని ప్రధాని అన్నారు. తుంగైపరలోని బంగబంధు ముజిబుర్‌ సమాధిని సందర్శించి నివాళులర్పిస్తానని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. 

షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ గొప్ప ఆర్థిక, అభివృద్ధి సాధించిందని ప్రధాని ప్రశంసించారు. ఆ దేశ విజయాలకు భారత్‌ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని చెప్పేందుకు ఈ పర్యటన  సూచికగా నిలుస్తుందని మోడీ చెప్పారు.  కరోనా మహమ్మారిపై బంగ్లాదేశ్ చేస్తున్న పోరాటానికి భారత్ సహాయ సహకారాలు ఉంటాయని నరేంద్రమోడీ అన్నారు. 
 

click me!