జ్ఞానవాపి మసీదు స్థలాన్ని హిందువులకు అప్పగించాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ముస్లిం సోదరులు ఆ సైట్‌ను హిందువులకు అప్పగించి మత సామరస్యానికి దోహదపడాలని సూచించారు.
Gyanvapi Mosque: బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపి మసీదు స్థలాన్ని హిందువులకు ఇచ్చేయాలని అన్నారు. అలాగే.. ఈ స్థలంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, లేదంటే మత సామరస్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణలో ఆర్కియలాజికస్ సర్వే ఆఫ్ ఇండియా దాని సర్వే రిపోర్టును హిందు, ముస్లిం పార్టీల తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులకూ అందించింది. హిందూ లిటిగెంట్ తరఫు న్యాయవాది ఆ రిపోర్టును బహిరంగం చేశారు. ఆ సర్వేలోని వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆ మసీదు కింద భారీ మందిరం ఉన్న ఆనవాళ్లు ఉన్నాయని, ఆ మందిరాన్ని 17వ శతాబ్దంలో కూల్చేసి మసీదు నిర్మించినట్టు అనుమానాలను ఆ సర్వే వ్యక్తపరిచింది. ఈ సర్వే రిపోర్టు వెలువడిన మరుసటి రోజు కేంద్రమంత్రి గిరిరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయోధ్యలో రామ ప్రతిష్ట కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిందని, దీన్ని సనాతనులు అందరూ స్వాగతించారని కేంద్రమంత్రి తెలిపారు. కానీ, తమ డిమాండ్ ఎప్పుడూ అయోధ్యతోపాటు కాశీ, మధుర కూడా ఉన్నదని వివరించారు.
Also Read:Nitish Kumar: ఇండియా కూటమిపై నితీశ్ కుమార్ కామెంట్.. కాంగ్రెస్ గురించి ఏమన్నారంటే?
‘నేను ముస్లిం సోదరులను కోరేది ఏమిటంటే.. ఆధారాలు అన్నీ బయటికి వచ్చిన తర్వాత, కాశీని హిందువులకు హ్యాండోవర్ చేయాలి. తద్వార మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. స్వాతంత్ర్యం తర్వాత మేం ఏ ఒక్క మసీదును కూడా కూల్చేయలేదు. కానీ, పాకిస్తాన్‌లో ఒక్క మందిరం కూడా లేదు’ అని గిరిరాజ్ సింగ్ అన్నారు.
‘నేను ఈ మాటలను కేవలం మత సామరస్యం కోసమే చెబుతున్నాను. వీటిని రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా తీసుకోరాదు. ఇది రూపాంతరం చెందిన ఇండియా, సనాతని యువత మేలుకుంది’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ‘ఎవరైనా బాబర్ లేదా ఔరంగజేబుగా ప్రయత్నిస్తే.. యువత మహారాణా ప్రతాప్‌లుగా మారుతారు. మీరే శాంతిని కాపాడాలి, ఆ బాధ్యత ఇప్పుడు మీ మీదే ఉన్నది’ అని కేంద్రమంత్రి గిరిరాజ్ తెలిపారు.