ఎట్టకేలకు నితీశ్ కుమార్ స్పందించారు. జేడీయూ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. జేడీయూ ఇండియా కూటమితోనే ఉన్నదని వివరించారు. అయితే, మిత్రపార్టీలతో కాంగ్రెస్ తీరును ఆత్మశోధన చేసుకోవాలని సూచించారు.
Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్ చుట్టూ గత రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పి మళ్లీ బీజేపీ కూటమితో దోస్తీ చేయబోతున్నట్టు వార్తల మీద వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల సీట్లపైనా అవగాహన కుదిరిందని, 28వ తేదీన ఆయన బీజేపీ-జేడీయూ ప్రభుత్వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనీ కథనాలు వచ్చాయి. అయితే, వీటిపైనా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. తాజాగా సీఎం నితీశ్ కుమార్ శుక్రవారం స్పందించారు.
తమ పార్టీ జేడీయూ ఇండియా కూటమిలోనే ఉన్నదని సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే, మిత్ర పార్టీలతో కూటమి, సీట్ల పంపకాలపై కాంగ్రెస్ ఆత్మశోధన చేసుకోవాలని కోరుకుంటున్నట్టు వివరించారు. జేడీయూ పార్టీ తిరిగి ఎన్డీఏలో చేరుతుందన్న వార్తలను రాష్ట్ర జేడీయూ అధ్యక్షుడు ఉమేశ్ సింగ్ కుష్వాహా ఖండించారు.
బిహార్ అధికార కూటమి మహాఘట్ బంధన్‌లో సమస్యలేమీ లేవని కుష్వాహా చెప్పారు. బిహార్ అధికార కూటమిలో అంతా సవ్యంగానే ఉన్నదని వివరించారు. మీడియాలో కథనాలు ముందే నిర్దేశించుకున్న ఓ అజెండా ప్రకారం ప్రచురిస్తున్నారని ఆరోపించారు.
Also Read: KCR: పార్లమెంటులో బీఆర్ఎస్ గళం బలంగా వినిపించాలి.. త్వరలో ప్రజల్లోకి వస్తా: మాజీ సీఎం కేసీఆర్
‘నేను నిన్న, ఇవాళ్ల కూడా ముఖ్యమంత్రిని కలిశాను. ఇది చాలా రోటీన్ వ్యవహారం. ఇప్పుడు ప్రచారంలో ఉన్న వదంతులు వట్టి పుకార్లే. అందులో వాస్తవం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ పాట్నాకు రమ్మన్నట్టు వచ్చిన వార్తలనూ ఖండిస్తున్నాం’ అని కుష్వాహా స్పష్టత ఇచ్చారు.