
తమిళనాడు(Tamil Nadu) రాష్ట్ర మంత్రి వి సెంథిల్ బాలాజీకి (Senthil Balaji)ని ఈడీ(ED) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టుతో తమిళ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ క్రమంలో మంత్రి వి సెంథిల్ బాలాజీకి ఉన్న శాఖలను ఇతర మంత్రులకు కేటాయించాలని సీఎం స్టాలిన్ సిఫారస్సు చేయగా.. అందుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించారు.
ఈ విషయాన్ని డిఎంకె మంత్రి కె పొన్ముడి తెలియజేశారు. ఉన్న శాఖలను ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎస్ ముత్తుసామికి తిరిగి కేటాయించాలని సీఎం ఎంకె స్టాలిన్ సిఫార్సు చేశారనీ, అయితే.. ఆ సిఫార్సును తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించారని పేర్కొన్నారు. ఉద్యోగాల కుంభకోణంలో సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది.
ఈ క్రమంలో విలేకరులతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి మాట్లాడుతూ.. “సెంథిల్ బాలాజీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన శాఖలను ఇతర మంత్రులకు తిరిగి కేటాయిస్తున్నట్లు సిఎం ఎంకె స్టాలిన్ గవర్నర్‌కు తెలియజేశారు. అయితే.. ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ, పోర్ట్‌ఫోలియో పునర్విభజనకు తాను చెప్పిన కారణాన్ని 'తప్పుదోవ పట్టించేది' గా ఉందని పేర్కొంటూ గవర్నర్ సిఎంకు తిరిగి లేఖ రాశారని తెలిపారు.
గవర్నర్ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని డీఎంకే మంత్రి ఆరోపించారు. గవర్నర్‌కు రాజ్యాంగం తెలిసి ఉంటే.. ఆయన సిఫారసును ఆమోదించేవాడని అన్నారాయన. ఉద్యోగాల కుంభకోణంలో అరెస్టయిన సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి తప్పించాలని గవర్నర్ ఆర్ఎన్ రవి మే 31న (సీఎం జపాన్ పర్యటనలో ఉన్న సమయంలో) సీఎం ఎంకే స్టాలిన్‌కు లేఖ రాశారని పొన్ముడి ఆరోపించారు. కేవలం ఆరోపణల కారణంగానే మంత్రివర్గం నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని పేర్కొంటూ సీఎం మరుసటి రోజు గవర్నర్‌కు లేఖ రాశారని డీఎంకే మంత్రి పేర్కొన్నారు.
సెంథిల్ బాలాజీ అరెస్ట్
ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన కేసులో విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీని ఈడీ(ED) అధికారులు అరెస్ట్ చేసింది. ఆయన అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో (2013లో) రాష్ట్ర రవాణా శాఖలో ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశారని మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి. ఈనేపధ్యంలోనే ఈడీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు.
ఈ సుధీర్ష విచారణ అనంతరం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. అయితే అరెస్ట్ తర్వాత ఆయన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఉండటంతో అధికారులు ఆయన్ని ఆసుపత్రి(Hospital)లో చేర్చారు. చికిత్స పొందుతున్న మంత్రి బాలాజీని తమిళనాడు క్యాబినెట్ మంత్రులు పరామర్శించేందుకు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. మరోవైపు ఆయన అరెస్ట్‌ని ఖండిస్తున్నారు.