
IndiGo: ఇండిగో విమానం మరోసారి ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి అహ్మదాబాద్ కి బయలుదేరిన ఇండిగో విమానం 6E6595 అహ్మదాబాద్‌లో ల్యాండ్ అవుతున్నప్పుడు సమయంలో ప్రమాదవశాత్తు తోక భాగం రన్ వేకు తాకింది. ఈ ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రయాణికులు కాసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఈ ప్రమాదంలో ఆ ఫైట్ స్వల్పంగా ధ్వంసమైంది. దాంతో ఆ విమానాన్ని సేవల నుండి తాత్కాలికంగా తప్పించారు. అదే సమయంలో విమానంలోని ఆపరేటింగ్ సిబ్బందిని దర్యాప్తు పూర్తయ్యేవరకు, తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. గత ఐదు రోజుల్లో ఇటువంటి సంఘటన జరగడం రెండోసారని, ఈ ఘటనపై డీజీసీఏ (DGCA) అంతర్గత విచారణకు ఆదేశించింది.
ప్రమాదానికి గురైన విమానం పైలట్లను గ్రౌండింగ్ చేయాలని డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఆదేశించినట్లు అధికారి తెలిపారు. అంతకు ముందు జూన్ 11 న కోల్ కతా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌బస్ A321 విమానం కోల్‌కతా నుండి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేటప్పుడు టెయిల్ స్ట్రైక్‌ను ఎదుర్కొంది. ఈ ఘటన తర్వాత విమానంలోని కాక్‌పిట్ సిబ్బందిని దింపాలని డిజిసిఎ ఇండిగోను ఆదేశించింది.
టెయిల్ స్ట్రైక్ అంటే ఏమిటీ?
విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో లేదా టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం తోక భాగం రన్ వే కు తగలడాన్ని టెయిల్ స్ట్రైక్ అంటారు. ఇటీవలి కాలంలో ఈ టెయిల్ స్ట్రైక్ ఘటనలు కూడా చాలానే పెరుగుతున్నాయి.