
గత నెల రోజులు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే.. అతడిని లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మే 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు పాదయాత్ర చేసేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రెజ్లర్లను అదుపులోకి తీసుకుని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. ఈ ఎఫ్‌ఐఆర్‌ను ఢిల్లీ పోలీసులు ఉపసంహరించుకుంటారని వర్గాలు ఇండియా టుడే టీవీకి తెలిపాయి. మే 28న, భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని అనేక సెక్షన్ల కింద వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ మరియు బజరంగ్ పునియాతో సహా రెజ్లర్ల నిరసన నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
రెజ్లర్ల నిరసన
ఎఫ్‌ఐఆర్‌పై వినేష్ ఫోగట్ స్పందిస్తూ.. కొత్త చరిత్ర లిఖించబడుతోందని అన్నారు. “లైంగిక వేధింపుల కింద బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఢిల్లీ పోలీసులు ఏడు రోజులు పడుతుంది, కానీ శాంతియుతంగా నిరసన చేపట్టినందుకు మాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఏడు గంటలు కూడా పట్టలేదు. దేశం నియంతృత్వంలోకి జారిపోయిందా? ప్రభుత్వం తమపై (ఆటగాళ్ల) పట్ల ఎలా వ్యవహరిస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోంది. కొత్త చరిత్ర లిఖించబడుతోంది’’ అని ఫోగట్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
నిర్బంధంపై స్పందిస్తూ.. బజరంగ్ పునియా ఇలా అడిగారు. “పోలీసులు నన్ను తమ కస్టడీలో ఉంచుకున్నారు. వాళ్ళు ఏమీ అనడం లేదు. నేను ఏదైనా నేరం చేశానా? బ్రిజ్ భూషణ్ జైల్లో ఉండాల్సింది. మమ్మల్ని ఎందుకు జైల్లో ఉంచారు? " అని ఆగ్రహం వ్యక్తం చేశఆరు. రెజ్లర్లపై సెక్షన్ 147,సెక్షన్ 149, 186, 188, 332 కింద అభియోగాలు మోపారు.అలాగే.. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే నిరోధక చట్టంలోని సెక్షన్ 3 కింద కూడా నిరసనకారులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఉద్యమం ఎందుకు వాయిదా పడింది?
క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ మేరకు నిరసనను జూన్ 15 వరకు వాయిదా వేయాలని నిరసనలో ఉన్న రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ కోరారు. ఆటగాళ్లతో సమావేశం అనంతరం జూన్ 15లోగా బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇది కాకుండా జూన్ 30లోగా డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలను నిర్వహించాలని, డబ్ల్యూఎఫ్‌ఐ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించామని ఠాకూర్ చెప్పారు.
మల్లయోధులు ఏం చెప్పారు?
ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇటీవల సోనిపట్‌లో జరిగిన మహాపంచాయత్ సందర్భంగా సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తెలిపారు. సింగ్‌ను అరెస్టు చేయకుంటే దానిని కొనసాగిస్తానని మాలిక్ చెప్పారు. న్యాయం జరగకపోతే ఆసియా క్రీడల ట్రయల్స్‌లో పాల్గొనబోనని పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఛార్జ్ షీట్‌లో ఏముంది?
బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చేసిన మైనర్ రెజ్లర్ ఫిర్యాదును రద్దు చేయాలని పోలీసులు సిఫార్సు చేస్తూ.. ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని చెప్పారు. మైనర్ రెజ్లర్ గతంలో బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా తర్వాత దానిని వెనక్కి తీసుకున్నాడు. ఢిల్లీ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) సుమన్ నల్వా మాట్లాడుతూ.. పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) కేసులో, ఫిర్యాదుదారుని అంటే మైనర్ తండ్రి, వారి వాంగ్మూలాల ఆధారంగా కేసును రద్దు చేయాలని అభ్యర్థిస్తూ ఒక నివేదికను దాఖలు చేశారు. ఈ విషయంపై స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ .. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్‌లు 354, 354A,354డి కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది.