గురుగ్రామ్ లో సంప్రదాయబద్ధంగా కుక్కలపెళ్లి.. పట్టుచీరలు, కట్నకానుకలు, హల్డీ, మెహందీ వేడుకలతో జోరుగా..

By SumaBala BukkaFirst Published Nov 14, 2022, 10:26 AM IST
Highlights

గురుగ్రాంలో ఓ వింత పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాము పెంచుకుంటున్న కుక్కలకు ఓ రెండు కుటుంబాలు పెళ్లికార్డులు పంచి మరీ సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేశాయి. 

గురుగ్రామ్ : ఓ దంపతులు తమ పెంపుడు కుక్కకు భారతీయ సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించిన విచిత్ర ఘటన గురుగ్రామ్ లో వెలుగు చూసింది. గురుగ్రామ్ నగరానికి చెందిన సవిత అలియాస్ రాణి స్వీటీ అనే ఆడ కుక్కను పెంచుకుంటోంది. సవిత భర్త గుడికి వెళ్లి కుక్కలకు ఆహారం పెట్టి వచ్చేవాడు. ఈ క్రమంలో ఓ రోజు అలా పెట్టివస్తున్నప్పుడు తన భర్తను అనుసరించి ఓ వీధికుక్క ఇంటికి వచ్చింది. ఆ తరువాత అది అక్కడినుంచి వెళ్లలేదు. దీంతో దానికి స్వీటీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నామని సవిత చెప్పారు. 

తాము పెంచుకుంటున్న స్వీటీకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకుని పొరుగున ఉన్న మరో కుక్కను చూశామని కుక్క యజమానురాలు సవిత చెప్పారు. ఈ కుక్కల వివాహం కోసం పాలెం విహార్ ఎక్స్టెన్షన్స్ లోని జిలే సింగ్ కాలనీపరిసరాల్లోని వారికి కార్డులు పంచి హిందూ సంప్రదాయ పద్ధతిలో వేడుక నిర్వహించామని సవిత వివరించారు. సవిత దంపతులు రెండు కుక్కలకు మెహందీ, హల్దీ వేడుకలు నిర్వహించారు. తాము ఎనిమిదేళ్లుగా మగకుక్క షేరును పెంచుకుంటున్నాని, దీన్ని తన బిడ్డలాగా చూసుకుంటున్నామని, అందుకే మా పెంపుడు కుక్క పెళ్లిని వేడుకగా చేశామని యజమాని మణిత చెప్పారు. 

భారత్ లోని 99 శాతం ముస్లింల పూర్వీకులు హిందుస్థానీలే - ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్

కుక్కల పెళ్లికి కొందరు ఎంతో ఇష్టంతో వచ్చారని మణిత తెలిపారు. తమకు పిల్లలు లేనందువల్ల పెంపుడు కుక్క స్వీటీనీ కుమార్తెగా భావించి పెళ్లి చేసి సంతోషం పొందామని సవిత చెప్పారు. తన కూతురు లాంటి స్వీటీకి వంటపాత్రలు, చీరలు కొని వైభవంగా పెళ్లి చేశామని స్వీటీ యజమాని రాజా భావోద్వేగంతో తెలిపారు. కుక్కల కల్యాణోత్సవంలో ప్రజలు  ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి పెళ్లే జూన్ 7న ఉత్తరప్రదేశ్ లోనూ జరిగింది. పెంపుడు జంతువుల పట్ల యజమానుల ప్రేమ అపారమైనది. కొందరు తమ పెంపుడు జంతువులైన కుక్క, పిల్లి వంటి వాటికి తమ ఆస్తులు కూడా రాసిన సందర్భాల గురించి తరచుగా వింటూనే ఉంటాం. ఫ్యాషన్ షోలు సర్వసాధారణమే.. అయితే గత కొంత కాలంగా కుక్కలు, పిల్లుల వంటివాటికి పుట్టినరోజులు, సీమంతం.. ఇలా రకరకాల వేడుకలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇరువురు వ్యక్తులు మరో అడుగు ముందుకు వేసి రెండు కుక్కలకు పెళ్లి చేసి.. ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్ హమీర్ పూర్ జిల్లాలోని సుమెర్ పూర్ లో ఇద్దరు పూజారులు వినూత్నంగా ఆలోచించారు. తమ పెంపుడు కుక్కలకు వివాహం జరిపించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా  హిందూ సంప్రదాయం ప్రకారం వారి పెంపుడు కుక్కలకు వివాహం జరిపించారు.  సౌంఖర్ అడవుల్లో మనసర్ బాబా శివాలయం ఉంది. ఆ గుడిలో ప్రధాన పూజారి స్వామి ద్వారకా దాస్ మహారాజ్ అనే అతనికి ఓ పెంపుడు కుక్క ఉంది. ఈ కుక్కకు వివాహం చేయాలని అనుకున్న ఆయన పరఛాచ్ లోని బజరంగబలి ఆలయ పూజారి అర్జున్ దాస్ పెంచుకునే ఆడ కుక్కతో వివాహం నిశ్చయించాడు. జూన్ 5న ముహూర్తం పెట్టి తన శిష్యులను, భక్తులను ఆహ్వానించాడు.  వైభవంగా వివాహం జరిపించి, 500 మందితో భారీ ఊరేగింపు నిర్వహించారు. పెళ్లి తర్వాత అతిథులకు రకరకాల వంటకాలతో భోజనాలు కూడా వడ్డించారు. 

click me!