Coronavirus: గుజరాత్ కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఈ చర్యలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
Coronavirus: కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో దేశంలో ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ.. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధించింది. అయితే, కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న పలు నగరాల్లో ఇప్పటికే ఆంక్షలు సడలిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే కరోనా కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో అహ్మదాబాద్, వడోదరలో విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య కర్ఫ్యూ అమలులో ఉన్న రాష్ట్రంలో ఇవి రెండు మాత్రమే. శుక్రవారం నుంచి ఈ రెండు నగరాల్లో రాత్రిపూట కూడా రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రభుత్వం పేర్కొంది.
అయితే, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు మరియు కార్యకలాపాలకు సంబంధించి కొన్ని పరిమితులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అటువంటి సమావేశాలకు ప్రభుత్వం ఆక్యుపెన్సీపై 50 శాతం పరిమితిని విధిస్తూనే ఉంటుందని తెలిపింది. ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, బహిరంగంగా ఉమ్మివేయడం వంటి ఇతర కోవిడ్ మార్గదర్శకాలు అమలులో ఉంటాయని తెలిపింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరూ కోవిడ్-19 టీకాలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. ఇదిలావుండగా, రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 12,21,874 కరోనా కేసులు, 10,919 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో గుజరాత్ లో కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 8 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
undefined
ఇక దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టగా.. మరణాలు సైతం తగ్గాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,166 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య మొత్తం 4,28,94,345 కు పెరిగింది. ఇదే సమయంలో 26,988 (RECOVERED) మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రికవరీల సంఖ్య 4,22,46,884 కి పెరిగింది. ప్రస్తుతం 1,34,235 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 302 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,13,226 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.5 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 1.5 శాతంగా ఉంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ లు టాప్ లో ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటివరకు మొత్తం 78,62,650 మంది కరోనా బారినపడ్డారు. అలాగే, 1,43,675 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, గత 24 గంటల్లో కొత్తగా కరోనా కేసులు, మరణాలు అధికంగా కేరళలో నమోదయ్యాయి.