అమెరికాలోకి అక్రమంగా వెళ్లబోయాడు.. యూఎస్ మెక్సికో బార్డర్ వాల్ పై నుంచి పడి గుజరాత్ వాసి దుర్మరణం

By Mahesh KFirst Published Dec 23, 2022, 6:12 PM IST
Highlights

అమెరికాలోకి అక్రమ మార్గంలో యూఎస్, మెక్సికో గోడ దూకి వెళ్లాలనుకున్న ఓ గుజరాత్ నివాసి దుర్మరణం చెందాడు. ఆ గోడ పై నుంచి కింద మరణించాడు. కాగా, అతని వెంటే భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నట్టు యూఎస్ మీడియా తెలిపింది.
 

న్యూఢిల్లీ: గుజరాత్‌ నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించి ఈ ఏడాది జనవరి ఒక కుటుంబం మొత్తం గడ్డకట్ట చలిలో మరణించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గుజరాత్ వాసులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నాలకు సంబంధించిన ఘటనలు చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా, గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికా, మెక్సికో సరిహద్దులో నిర్మించిన గోడ (ట్రంప్ వాల్) పై నుంచి మరణించాడు. గాంధీనగర్ నుంచి వెళ్లిన ఆ వ్యక్తి మరణంపై గుజరాత్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అమెరికాలో కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాల ప్రకారం, అతడిని బ్రిజ్ కుమార్ యాదవ్‌గా గుర్తించారు. గాంధీనగర్ జిల్లా కలోల్ తాలూకా నివాసిగా ధ్రువీకరించారు. భార్య, మూడేళ్ల కుమారుడితో కలిసి అతడు అక్రమంగా అమెరికాలోకి అడుగు పెట్టాలని ప్రయత్నించాడు. అమెరికా, మెక్సికో సరిహద్దులో నిర్మించిన భారీ గోడను క్రాస్ చేసి యూఎస్‌లోకి ప్రవేశించాలని అనుకున్నాడు. కానీ, వారు ఆ గోడ పై నుంచి కింద పడిపోయారు. బ్రిజ్ కుమార్ యాదవ్ గోడ పై నుంచి కింద పడి మరణించాడు. కాగా, అతని భార్య అమెరికా వైపు పడిపోయింది. కొడుకు మెక్సికో వైపు పడిపోయాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నట్టు మీడియా రిపోర్టులు తెలిపాయి. 

Also Read: చావు చూపించిన అమెరికా డ్రీమ్.. అక్రమంగా వెళ్లడానికి ప్రయత్నించిన గుజరాత్ వాసులు.. ‘ప్రాణాలైనా దక్కాయి’

బ్రిజ్ కుమార్ యాదవ్ గాంధీనగర్‌లోని కలోల్‌ యూనిట్ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌‌లోని ఓ ఫ్యాక్టరీలో పని చేసేవాడని తెలిసింది.

ఈ ఘటన గురించి మీడియా ద్వారా తెలుసుకున్న రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) రంగంలోకి దిగింది. ఇందులో నిజానిజాలను తేల్చాలని ఆదేశించింది. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది.

ఈ ఘటన గురించి మీడియా ద్వారా తెలిసి తర్వాత దర్యాప్తునకు ఆదేశించామని, మొత్తం వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ సెల్ డిప్యూటీ ఎస్పీని ఆదేశించినట్టు సీఐడీ ఆర్బీ బ్రహ్మ భట్ తెలిపారు.

కాగా, ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నామని, వారి కుటుంబ సభ్యలను కనుగొనడానికి దర్యాప్తు ప్రారంభించామని గాంధీనగర్ ఎస్పీ తరుణ్ కుమార్ దుగ్గల్ తెలిపారు. ఇప్పటి వరకు సహాయం కోసం ఎవరూ పోలీసులను సంప్రదించలేదని వివరించారు.

Also Read: అక్రమ దారిలో అమెరికా వెళ్లాలనుకున్నారు! టర్కీలో 37 గుజరాతీ కుటుంబాలు ‘మిస్సింగ్’.. మాఫియానే కిడ్నాప్ చేసిందా?

అమెరికాను డ్రీమ్ ల్యాండ్ అంటారు. చాలా మంది అక్కడ నివసించాలని ఉవ్విళ్లూరుతుంటారు. మన దేశంలో నూ అలాంటి వారు ఉన్నారు. గుజరాత్‌ కు చెందిన 19 మంది అదే జాబితాలోకి వస్తారు. అక్రమ మార్గంలోనైనా సరే అమెరికా వెళ్లాలని వీరు నిర్ణయించుకున్నారు. అక్రమ మానవ రవాణా ఏజెంట్ల ను నమ్మారు. సగం దూరం వెళ్లారు. నలుగురు మరణించారు కూడా. మిగతా వారు డబ్బు, సమయం వృథా చేసుకున్న ప్రాణాలు దక్కించుకున్నారు.

click me!