మధ్యప్రదేశ్‌లో కూడా గుజరాత్ ఫార్ములా.. రాష్ట్ర బీజేపీ నేతల్లో దిగులు..!

By Mahesh KFirst Published Dec 18, 2022, 2:45 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లోనూ గుజరాత్ ఫార్ములా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ కేంద్రనాయకత్వవర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. దీంతో మధ్యప్రదేశ్‌లో అధికారంలోని బీజేపీ నేతలు దిగులుపడుతున్నారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు సీఎం సహా మొత్తం క్యాబినేట్‌నే మార్చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది చివరలో ఉన్నాయి.
 

భోపాల్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. 1995 నుంచి అధికారంలో ఉన్న కమలం పార్టీ ఏడోసారి గెలిచింది. అదీ రికార్డ్ సీట్లతో విజయాన్ని కైవసం చేసుకుంది. గుజరాత్ చరిత్రలో 156 స్థానాలు గెలవడం ఇదే ప్రప్రథమం. అదే రాష్ట్రంతోపాటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ, అక్కడ ప్రతి ఎన్నికలోనూ అధికార పక్షం మారిపోతూ ఉంటుంది. ప్రజలు వేరే పార్టీకి అధికారాన్ని అప్పజెబుతుంటారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది అన్ని రాష్ట్రాల్లో.. అన్ని చోట్ల సహజంగా కనిపించే అంశమే. కానీ, గుజరాత్‌లో ఈ ప్రభుత్వ వ్యతిరేకతకు విరుగుడుగా బీజేపీ ఒక స్ట్రాటజీ అప్లై చేసింది. దీంతో గతంలో కంటే కూడా ఈ సారి ఓటు షేరింగ్ కూడా పెరిగింది. గుజరాత్‌లో అమలు చేసిన ఆ స్ట్రాటజీనే ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని బీజేపీ నేతలకు దిగులు పుట్టిస్తున్నది.

గుజరాత్‌లో 27 ఏళ్లు వరుసగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి సీఎం, మొత్తం క్యాబినెట్‌నే మార్చేసింది. ఎన్నికలకు సుమారు ఏడాది ముందు అంటే.. గతేడాది సెప్టెంబర్‌లో ఈ మార్పు జరిగింది. అప్పటి వరకు సీఎంగా ఉన్న విజయ్ రూపానీని పక్కకు జరిపింది. అతని మొత్తం మంత్రి మండలినే తొలగించింది. కొత్తగా భుపేంద్ర పటేల్‌ను సీఎంగా ఎంపిక చేసింది. కొత్త క్యాబినెట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మార్పు కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతను ఏడాది కాలంలో చాలా వరకు తగ్గించిందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, 45 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. వారి స్థానంలో కొత్త ముఖాలను తెర మీదికి తెచ్చింది. ఇందులో ఇద్దరు మినహా అందరూ గెలిచారు.

Also Read: ఘనంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారోత్సవం.. హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా

ఇప్పుడు ఇదే స్ట్రాటజీని మధ్యప్రదేశ్‌లోనూ అమలు చేస్తారా? అనే ఆందోళన రాష్ట్ర బీజేపీ నేతల్లో కనిపిస్తున్నది. అదే అమలు చేస్తే ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి సీటుకు బై చెప్పాల్సి ఉంటుంది. అతని క్యాబినెట్ కూడా ఖాళీ కావాల్సి ఉంటుంది. అంతేగాక, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోనూ తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లభిస్తుందా? లేదా? అనే సంశయాలు మొదలవుతున్నాయి. ఈ స్ట్రాటజీనే రాష్ట్ర బీజేపీ నేతల్లో గుబులు పెట్టిస్తున్నదని తెలుస్తున్నది.

2023 చివరలో మధ్యప్రదేశ్‌కు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోనూ గుజరాత్ స్ట్రాటజీని బీజేపీ అమలు చేసే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేత ఒకరు మాట్లాడుతూ, పంట పండించాలంటే ముందు పొలం దున్నాలని, పంటకు భూమిని సిద్ధం చేయాలని అన్నారు. దాని పేరు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గుజరాత్ స్ట్రాటజీ అని పెట్టుకోవచ్చు అని వివరించారు. కేవలం మధ్యప్రదేశ్‌లోనే కాదు, మొత్తం దేశంలో ఈ స్ట్రాటజీ అమలు చేస్తామని బీజేపీ జాతీయ జనరల్ సెక్రెటరీ కైలాశ్ విజయవర్గీయ తెలిపారు. 

Also Read: చావు చూపించిన అమెరికా డ్రీమ్.. అక్రమంగా వెళ్లడానికి ప్రయత్నించిన గుజరాత్ వాసులు.. ‘ప్రాణాలైనా దక్కాయి’

పరిస్థితులు, అధికారంలోని నేతలు, వ్యవస్థ అభిప్రాయాలపై ఆధారపడి ఈ నిర్ణయం ఉంటుందని మందసౌర్ నుంచి మూడు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే యశ్‌పాల్ సిసోడియా తెలిపారు. కాగా, బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయం ఏదైనా పార్టీకి, అంతిమంగా ప్రజలకు ఉపయోగపడేదే ఉంటుందని మరో ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ అన్నారు.

click me!