గుజరాత్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్: 56.88 శాతం ఓటింగ్ నమోదు

By narsimha lodeFirst Published Dec 1, 2022, 6:56 PM IST
Highlights

గుజరాత్ అసెంబ్లీకి  తొలి విడత  పోలింగ్   గురువారంనాడు ముగిసింది.  ఇవాళ ఉదయం నుండి  జరిగిన పోలింగ్ లో  56.88 శాతం  పోలింగ్ నమోదైంది.  89 అసెంబ్లీ స్థానాల్లోని  788 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 

గాంధీనగర్: గుజరాత్‌లో  గురువారంనాడు తొలి విడత  పోలింగ్  ముగిసింది.  సుమారు  56.88 పోలింగ్  నమోదైందని అధికారులు చెప్పారు.రాష్ట్రంలోని  19 జిల్లాల్లోని  89 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ  ఎన్నికలు జరిగాయి. సౌరాష్ట్ర, కచ్  దక్షిణ ప్రాంతాల్లో ఈ  అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సూరత్ , పోర్‌బందర్ , ఖంభాలియా, రాజ్‌కోట్ , జామ్ నగర్ నార్త్ వంటి  నియోజకవర్గాలున్నాయి.ఈ నెల 5వ తేదీన  రెండో విడత ఎన్నికలు  జరగనున్నాయి.

2017లో గుజరాత్  లో బీజేపీ అధికారంలోకి రావడానికి  సూరత్  ప్రాంతం కీలక పాత్ర పోషించింది.  సూరత్ ప్రాంతం బీజేపీకి కంచుకోటగా  పేరొందింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు,కేంద్ర మంత్రులు బీజేపీ తరపున గుజరాత్  లో విస్తృతంగా  ప్రచారం నిర్వహించారు. గుజరాత్  ఎన్నికల్లో  చివర్లో  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. భారత్  జోడో  యాత్రకు విరామం  ఇచ్చిన  రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం ముగింపు సమయంలో  ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆప్  చీఫ్, ఢీల్లీ సీఎం  అరవింద్  కేజ్రీవాల్  రాష్ట్రంలో విస్తృతంగా  ప్రచారం నిర్వహించారు. తొలి దశలో  పోలింగ్  జరిగిన  89 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  788 మంది అభ్యర్దులు బరిలో నిలిచారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్  మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 

2017 ఎన్నికల్లో  89 అసెంబ్లీ స్థానాల్లో  బీజేపీ  48, కాంగ్రెస్  40,ఒక్క స్థానంలో  ఇండిపెండెంట్  అభ్యర్ధి  విజయం సాధించారు. 89 అసెంబ్లీ స్థానాల్లో  ఆప్ తమ అభ్యర్ధులను బరిలోకి దింపింది.సూరత్  తూర్పు అసెంబ్లీ స్థానంలో ఆప్  తన  అభ్యర్ధిని పోటీ నుండి  ఉపసంహరించుకుంది. బీఎస్పీ  57  స్థానాల్లో, బీటీపీ 14  స్థానాల్లో, సీపీఎం నాలుగు స్థానాల్లో తమ  అభ్యర్ధులను బరిలోకి దింపింది. తొలి దశ  ఎన్నికల్లో  339 మంది  ఇండిపెండెంట్లు కూడా బరిలో  ఉన్నారు. 
 

click me!