కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి ధ్వజమెత్తారు. గరీబీ హఠావో అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఇస్తోందనీ, ఆ హామీని నెరవేర్చడానికే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఇచ్చారనీ అన్నారు. కానీ,నినాదాలు, హామీలు ఇవ్వడం, ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేశారని విమర్శించారు.
గుజరాత్ లో రెండో దశ ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన భుజస్కంధాలపై ఎన్నికల ప్రచార బాధ్యతలు వేసుకున్నారు. వరుస రోడ్‌షోలు, ర్యాలీలతో ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ చోటా ఉదయ్ పూర్ జిల్లాలోని బొడెలీలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ మరోసారి ధ్వజమెత్తారు. పేదరికాన్ని తొలగించే పేరుతో కాంగ్రెస్ పేదరికాన్ని పెంచి పోషించిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో పేదరికం పెరిగిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. వారు పేదరిక నిర్మూలన కోసం ఎలాంటి పనులు చేయకుండా.. నినాదాలు మాత్రమే చేసి దేశాన్ని తప్పుదోవ పట్టించారని విమర్శించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పేదరికాన్ని తొలగించాలని చెబుతోందనీ, ప్రజలు అధికారం ఇచ్చినా..పేదరికాన్ని తొలగించలేకపోయింది. కేవలం నినాదాలు, వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టారనీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పేదరికం పెరగడానికి అసలు కారణమిదేనని అన్నారు.
గత కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాల వల్ల పేద పౌరులు ఆర్థిక వ్యవస్థలో చురుకైన పాత్ర పోషించలేకపోయారని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో బ్యాంకులను జాతీయం చేసినా పేదలు బ్యాంకు ఖాతాలు తెరవలేకపోయారన్నారు. కాంగ్రెస్ తన ప్రభుత్వ హయాంలో విద్య, ఆరోగ్యం, పారిశ్రామిక రంగాల్లో పేద ప్రజలకు, గిరిజనులకు, ఓబీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధాని పేర్కొన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో గిరిజన నేత ద్రౌపది ముర్ము అధ్యక్షుడిగా ఎన్నికైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిని గిరిజన మహిళ అలంకరించడం ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకించిందనీ, అందుకే తమ అభ్యర్థిని నిలబెట్టిందని మోదీ ఆరోపించారు. దేశ రాష్ట్రపతి ప్రతి గిరిజన కుటుంబానికి, ప్రతి పౌరునికి గర్వకారణమని ఆయన అన్నారు. కానీ.. ద్రౌపతి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఏ గిరిజన మహిళను భారత రాష్ట్రపతిని చేయాలని ఏ ప్రతిపక్ష పార్టీ కోరుకోలేదనీ, అందుకే ఆమెకు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టారని అన్నారు.
లేకుంటే ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై ఉండేదని అన్నారు.