
Morbi bridge collapse: గుజరాత్‌లోని మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కాంగ్రెస్ సోమవారం డిమాండ్ చేసింది. ప్రాథమికంగా చూస్తే ఇది నేరపూరిత నిర్లక్ష్యం, స్థూల పాలనా లోపంగా కనిపిస్తోందని ఆరోపించింది. అలాగే, బాధితులందరికీ ప్రభుత్వం నుండి ఆర్థిక, వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేసింది. గుజరాత్ లో బ్రిటిష్ కాలం నాటి వంతెన పునరుద్ధరించిన వారం రోజులకే కూలిపోవడంతో 14ం మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్‌కు 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కుప్పకూలింది. ఛత్ పూజకు సంబంధించి కొన్ని ఆచారాలు నిర్వహించడానికి సుమారు 500 మంది దానిపై గుమిగూడారు. ఈ వంతెనకు చాలా కాలంపాటు విస్తృతమైన మరమ్మతులు, పునరుద్ధరణ తర్వాత ఐదు రోజుల క్రితం ఈ వంతెనను తెరిచారు.
ఆదివారం నాడు జనంతో కిక్కిరిసిపోయిన క్రమంలో వంతెన కూలిపోయింది. ఇంకా చాలా మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే .. తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాని కోరారు. మీడియా ఖర్గే మాట్లాడుతూ.. ఐదు రోజుల క్రితం మళ్లీ తెరిచిన వంతెన కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఇంత మందిని ఎందుకు అనుమతించారు? అని ప్రశ్నించారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఈ ఘటనపై విచారణ జరగాలని ఖర్గే అన్నారు.
మృతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని కోరారు. గాయపడిన వారికి ప్రభుత్వం వైద్య చికిత్సలో అన్ని సహాయాలు అందించాలని అన్నారు. "మా (కాంగ్రెస్) నాయకులు అక్కడికి చేరుకున్నారు. అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్ ముఖ్యమంత్రి) కూడా చేరుకున్నారు. మేము వీలైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము. దీనిపై ఎలాంటి రాజకీయాలు చేయడం లేదు.. ఈ సమయంలో ఎవరినీ నిందించడం మాకు ఇష్టం లేదు. విచారణ నివేదిక వెలువడినప్పుడే నిందలు రుజువు కాగలవు" అని మల్లికార్జున ఖర్గే అన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు, వృద్ధులే ఉన్నారని తెలియడంతో ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషాదం గురించి తెలుసుకున్న వెంటనే, అతను గత రాత్రి పరిస్థితిని సమీక్షించాడు. గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో మాట్లాడారు. పార్టీ సభ్యులు-ఫ్రంటల్ సంస్థలు అన్ని విధాలుగా రెస్క్యూ-రిలీఫ్ పనులలో సహాయం చేసేలా చూడాలని వారిని కోరారు.
గుజరాత్ ప్రభుత్వం క్షతగాత్రులకు తక్షణ వైద్య చికిత్స అందించాలనీ, ఇంకా తప్పిపోయిన వారందరి కోసం వెతకాలనీ, మృతుల కుటుంబాలకు-గాయపడిన వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని ఖర్గే ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ ప్రమాదానికి కారణాన్ని పరిశోధించడానికి న్యాయ విచారణకు కూడా ఖర్గే డిమాండ్ చేశారు, "ఇది ప్రాథమికంగా నేరపూరిత నిర్లక్ష్యం, స్థూల పాలనా లోపంగా కనిపిస్తోంది" అని ఆ ప్రకటన పేర్కొంది. రాజకీయాలకు ఇది సమయం కాదనీ, అయితే ఈ ఘోర ప్రమాదానికి బాధ్యత వహించాలనీ, దోషులను కఠినంగా శిక్షించాలని, అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అరికట్టవచ్చని పేర్కొంది. గుజరాత్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావంగా నిలుస్తుందని ఖర్గే హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా విచారం వ్యక్తం చేశారు. మోర్బీలో జరిగిన విషాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆమె సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తోందని మరో కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.