భారత్ ను క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ పొరుగు దేశాలు.. మ‌ళ్లీ ద‌క్షిణాదిలో అప్ప‌టి ప‌రిస్థితులు రానున్నాయా?

By Mahesh RajamoniFirst Published Apr 13, 2022, 10:19 AM IST
Highlights

Sri Lanka economic crisis: శ్రీలంక‌లో ప‌రిస్థితులు  దారుణంగా మారుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డి ప్రజలు ఇప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భారతదేశంలో ఆశ్రయం పొందాలనుకుంటున్నారు. గత రెండు వారాల్లో చాలా మంది శ్రీలంక పౌరులు తమిళనాడుకు వచ్చారు.
 

Sri Lanka economic crisis: ఆసియా ప్రాంతంలో ఇప్పుడు చాలా దేశాల్లో ప‌రిస్థితులు దారుణంగా మారుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా భార‌త్ చుట్టువున్న దేశాల్లో ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఆందోళ‌న క‌లిగిస్తున్నయి. భారతదేశ పొరుగు దేశాలలో పెరుగుతున్న రాజకీయ, ఆర్థిక అస్థిరత ఈ ఆందోళనలను లేవనెత్తింది. రాజ‌కీయ సంక్షోభం నేప‌థ్యంలో ప్ర‌స్తుతం పాకిస్తాన్‌లో వార‌స‌త్వ రాజ‌కీయ కుటుంబ ప్ర‌భుత్వం ఏర్పాటైంది. దీని కార‌ణంగా ఉగ్ర‌వాద ప్ర‌మాదం మ‌ళ్లీ పెరిగే అవ‌కాశ‌ముంద‌ని అంత‌ర్జాతీయంగా చాలా మంది విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న అస్థిరత కారణంగా చైనా తన అణుశక్తిని విస్తరిస్తోంది. ఇటీవ‌ల కాలంలో హ‌రిహ‌ద్దు వివాదాలు పెరుగుతున్న త‌రుణంలో భార‌త్ ను ఇది క‌ల‌వ‌ర‌ప‌రిచే అంశంగా మారింది. మ‌రో పొరుగు దేశం నేపాల్‌లో కూడా విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టడంతో నిత్యావసర వస్తువుల దిగుమతిపై నిషేధం విధించారు.

ఇక శ్రీలంకలో ప‌రిస్థితి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అక్క‌డ ఇప్పటికే ఆర్థిక సంక్షోభం తారా స్థాయికి చేర‌డంతో ప్ర‌భుత్వం చేతులెత్తేసింది. విదేశీ నిల్వ‌లు ఆయిపోయాయ‌నీ, రుణాలు చెల్లించే ప‌రిస్థితి లేదంటూ ప్ర‌క‌టించింది. అంత‌ర్జాతీయ స‌మాజ సాయం కోసం ఎదురుచూస్తోంది. అయితే ఇప్పుడు శ్రీలంక ఆర్థిక సంక్షోభం భారత్ ఆందోళనను మరింత పెంచింది. శ్రీలంక ప్రజలు ఇప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భారతదేశంలో ఆశ్రయం పొందాలనుకుంటున్నారు.  గత రెండు వారాల్లో పెద్ద ఎత్తున శ్రీలంక పౌరులు సముద్రం ద్వారా భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి వచ్చారు. శ్రీలంకలో పరిస్థితి త్వరగా మెరుగుపడకపోతే, వలసలు చాలా తీవ్రమైన మలుపు తీసుకుంటాయి. శ్రీలంకలో అంతర్యుద్ధం సమయంలో పరిస్థితి సరిగ్గా అదే విధంగా మారే అవకాశం ఉంది. 1983 మరియు 2009 మధ్య... శ్రీలంక‌లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE), శ్రీలంక సైన్యం మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో1990 మరియు 2009 మధ్య, 1.6 మిలియన్ల శ్రీలంక పౌరులు భారతదేశంలో ఆశ్రయం పొందారు.  దీని కారణంగా దక్షిణ భారతదేశంలోని నగరాల్లో అస్థిరత, హింసాత్మక వాతావరణం పెరిగింది.

శ్రీలంకలోని జాఫ్నాలో మత్స్యకారులు సముద్ర మార్గంలో భారత్‌కు రావాలన్నారు. అయితే వీరిని అడ్డుకునేందుకు శ్రీలంక సైన్యం శాయశక్తులా కృషి చేస్తోంది. శ్రీలంక ప్రస్తుతం ఇతర దేశాలకు దాదాపు 5,100 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. దాని విదేశీ మారక నిల్వలు దాదాపు అయిపోయాయి. ఇతర దేశాల అప్పులు తీర్చడానికి కాదుక‌దా.. ఆ దేశ ప్రజలను పోషించడానికి కూడా శ్రీలంక వద్ద డబ్బు లేదు. విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో.. ఆహారం, ఇత‌ర నిత్యావ‌స‌రాలు, ఇంధనం దిగుమతి తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఈ గందరగోళంలో శ్రీలంక ఇప్పుడు తన ప్రజలను దుర్భ‌ర ప‌రిస్థితి నుంచి కాపాడుకోవ‌డానికి IMF, ఇతర దేశాల ముందు చేతులు చాచాల్సి వస్తోంది. శ్రీలంక అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ‌ నుంచి బెయిలవుట్ ప్యాకేజీని ఆశిస్తోంది కానీ IMF దానికి ఎటువంటి అదనపు సహాయం అందించలేదు. 

ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న ఆర్థిక ఎమర్జెన్సీ, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏ దేశానికైనా లేదా సంస్థకైనా ఒక గుణపాఠం అని చెప్పాలి.  ఎందుకంటే..  అప్పుల సహాయంతో ఆర్థిక వ్యవస్థను కొంతకాలం పైకి లాగవచ్చు, కానీ దాని ఆధారంగా ఏ దేశం కూడా పురోగమించదు అనేది మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. రుణానికి పరిమితి కూడా ఉండాలి. శ్రీలంక ఆ దీనిని ప‌ట్టించుకోలేదు. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితులు దాపురించాయి. శ్రీలంక ప్రభుత్వం ఇప్పుడు న్యూయార్క్‌లో IMFతో సమావేశం కాబోతోంది. ఇందుకోసం ఏప్రిల్ 18న శ్రీలంక ఆర్థిక మంత్రితో కలిసి ఓ బృందం న్యూయార్క్ వెళ్లనుంది. ఏదేమైన‌ప్ప‌టికీ.. స్థానికంగా ఉత్ప‌త్తి పెంచ‌కుండా, ఇత‌ర సేవ‌ల కోసం రుణాల‌పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డ‌టం, దిగుమ‌తుల‌కు త‌గ్గ‌ట్టు ఎగుమ‌తులు లేకుంటే ఏం జ‌రుగుతుంద‌నేదానికి నేడు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది శ్రీలంక‌.  
 

click me!