
బెంగళూరు : బెంగళూరులోని సెక్యూరిటీ కెమెరాలో ఓ దారుణ ఘటన రికార్డయ్యింది. ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఓ 30 ఏళ్ల వ్యక్తిని ఇటుకతో తల పగులగొట్టి దారుణంగా హత్య చేశారు. గత శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో క్లిప్‌లో బెంగళూరులోని కెపి అగ్రహార ప్రాంతంలో ఒక గుంపు వీధిలో ఓ అరుగు మీద కూర్చున్న వ్యక్తిమీద దాడికి దిగినట్టుగా కనిపిస్తుంది. కాసేపు వారి మధ్య ఏదో విషయంగా వాగ్వాదం జరిగింది.
ఆ తరువాత మహిళల్లో ఒకరు పక్కనున్న ఇటుక రాయిని తీసుకుని వచ్చింది. దీంతో ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ అప్పటివరకు మాట్లాడుతున్న పురుషులు, మహిళలు అతడిని పారిపోకుండా ఒడిసిపట్టుకుని.. నేలమీదికి లాగేశారు. ఆ తరువాత ఆ మహిళ, మరో వ్యక్తి అతనిమీద పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారు.
అందులో ఓ వ్యక్తి మృతుడి తల మీద పదే పదే రాయితో దాడి చేశాడు. ఈ సమయంలో వారంతా అతను పారిపోకుండా పట్టుకని ఉన్నారు. ఈ వీడియో క్లిప్ 1.40 నిమిషాల డ్యూరేషన్ ఉంది. మిగతా వారు కూడా రాళ్లను ఉపయోగించినా.. ఒక వ్యక్తి మాత్రం అతని తలనే లక్ష్యంగా చేసుకుని పగలగొట్టాడు. బాధితుడు అరుపులు విన్న చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్ర గాయాల కారణంగా అతను మరణించాడు.
దాడి చేసిన వారిలో ఎవరినీ ఇంకా గుర్తించలేదు లేదా అరెస్టు చేయలేదు. బాధితురాలు బాదామి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.