ప్రత్యర్థిని ఇరికించేందుకు 9 ఏళ్ల బాలికను చంపేసిన తండ్రి, తాత, ముగ్గురు మేనమామలు.. యూపీలో ఘటన

By team teluguFirst Published Dec 6, 2022, 11:35 AM IST
Highlights

తమ ప్రత్యర్థిని ఇరికేందుకు ఓ కుటుంబం సొంత బిడ్డనే దారుణంగా హత్య చేసింది.ఆ నేరాన్ని శత్రుపైకి తోసేయాలని చూసింది. కానీ పోలీసుల విచారణలో అసలు నిందితులు కుటుంబ సభ్యులే అని తెలిసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. తమ శత్రువును హత్య కేసులో ఇరికించేందుకు ఓ కుటుంబం తమ ఇంటి బిడ్డను ఘోరంగా హతమార్చారు. అనంతరం ఏమీ తెలియనట్టు నటించారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా ఈ హత్య వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా సంచలనం రేకెత్తించింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీ పిలిభిత్‌ ప్రాంతంలోని మాధోపూర్ గ్రామానికి చెందిన అనిస్ అహ్మద్‌కు 2018 నాటి నుండి షకీల్‌ అనే వ్యక్తితో శత్రుత్వం ఉంది. దీంతో అతడిని ఇరికించేందుకు తమ బిడ్డను చంపాలని భావించాడు. ఈ హత్య కేసును షకీల్ పై తోసేయాలని ప్లాన్ చేశాడు. దీని కోసం బాలిక తాత షాజాదే, మేనమామలు అనిస్, నసీమ్, సలీమ్ ల సహాయం తీసుకున్నాడు. డిసెంబర్ 2వ తేదీన వీరంతా కలిసి మూడో తరగతి చదివే తొమ్మిదేళ్ల బాలిక అనమ్‌ అహ్మద్‌ను సరైనంద పట్టి అనే గ్రామానికి ఒక మతపరమైన కార్యక్రమానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెకు మత్తుముందులు ఇచ్చారు. సమీపంలోని ఓ పండ్ల తోటకు తీసుకెళ్లి మత్తులోకి జారుకున్నాక ఓ వరి గడ్డి కుప్ప కింద దాచిపెట్టారు. 

‘పర్లేదు సార్.. ఉండనివ్వండి...’ క్యాబ్ డ్రైవర్ సహృదయానికి మాజీ ట్విట్టర్ ఎండీ ఫిదా..

ఆ తర్వాత వారంతా ఇంటికి తిరిగి వెళ్లారు. అనమ్ అహ్మద్ తప్పిపోయిందని ఇంట్లో చెప్పారు. అందరినీ నమ్మించారు. ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కోసం గాలించారు. రాత్రి మొత్తం వెతికారు. కానీ బాలిక కనిపించలేదు. ఈ ఐదుగురు నిందితులు మళ్లీ డిసెంబర్ 3వ తేదీన ఉదయం బాలికను దాచి పెట్టిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆ చిన్నారి తలను దారుణంగా ఇటుకలతో పగలగొట్టారు. కత్తితో పొడిచారు. బాలిక దేహాన్ని చిధ్రం చేసి, ఆమెను ఎవరో కిరాతకంగా హత్య చేశారనే అభిప్రాయాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. 

కొన్ని గంటల తరువాత తమకు బాలిక లభించిందని నిందితులు తెలిపారు. దీంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. కానీ ఆశ్చర్యంగా ఆ బాలిక ఇంకా చనిపోలేదు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇంకా ఊపిరి పీల్చుకుంటోంది. కానీ నిందితులు ఆమెను దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా.. బాలికను ప్రశ్నిస్తూ కూర్చున్నారు. కత్తితో ఎవరు పొడిచారంటూ ఆమెను అడగడం ప్రారంభించారు. ఇలా దాదాపు అరగంట సమయం అక్కడే వృథా చేసారు. దీంతో బాలిక చనిపోయింది. అయితే ఆమె తీవ్ర నొప్పితో బాధపడటం వల్ల ఎవరి పేరు చెప్పలేకపోయింది.

గుడిలో ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న భక్తుడు... వీడియో వైరల్...! 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా నిందితులు తీరు పట్ల అనుమానం వచ్చింది. దీంతో వారిని ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్నారు. అమారియా ఎస్‌హెచ్‌ఓ ముఖేష్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘అమ్మాయి తండ్రి, ముగ్గురు మేనమామలు, తాతపై ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 120బీ (నేరపూరిత కుట్ర), 201 (నేరానికి సంబంధించిన సాక్ష్యం అదృశ్యం కావడం లేదా ఇవ్వడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. దోషులను జైలుకు పంపించాం’’ అని తెలిపారు. 

కాగా.. ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారు విచారణలో ఘోరమైన హత్యను అంగీకరించారని ఎస్పీ దినేష్‌కుమార్‌ ప్రభు తెలిపారు. ఘటనా స్థలం నుంచి హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధం, ఇటుక, మత్తు మాత్రల రేపర్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

click me!