
న్యూఢిల్లీ: అంతర్జాతీయ (శ్రామిక!) మహిళా దినోత్సవం(International women day) సందర్భంగా ఈ రోజు సోషల్ మీడియాలో, బయట కూడా మహిళా సాధికారత(Women Empowerment)పై విపరీతంగా చర్చ జరిగింది. ఇంకా జరుగుతున్నది. మహిళలపై పీడన, వారికి స్వేచ్ఛ, విముక్తి, వంటింటి కుందేలు వంటి పదాలేవో ఆ చర్చల్లో అనుకోకుండా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఎంతో గంభీరంగా వారి స్వాతంత్ర్యం కోసం తీసుకున్న నిర్ణయాలు మాట్లాడుతుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో మహిళల దుస్థితిని వెల్లడించే ఓ వీడియో ఇప్పుడు అంటే.. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే వైరల్ అయింది. ఆ వీడియోలో అమ్మాయి తరఫు వారు కచ్చితంగా వరకట్నం ఇవ్వాల్సిందేనని, ఆ డబ్బులు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో అమ్మాయి వాళ్లు ఉంటే.. ఆ పెళ్లి రద్దు అయ్యే పరిస్థితులూ ఉంటాయని ఆ వీడియో స్పష్టం చేసింది. పితృస్వామ్య వ్యవస్థ అవశేషమైన వరకట్నం(Dowry) ఇప్పటికీ బలంగా ఉన్నదని వెల్లడి చేసింది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకున్నట్టు ఆ వైరల్ వీడియోలో తెలుస్తున్నది.
ఆ వీడియోలో వధువు పక్కన ఉండగానే వరుడు కచ్చితంగా తనకు ముందుగా ఒప్పుకున్న వరకట్నం ఇవ్వాల్సిందేనని, లేదంటే ఇక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోతామని వార్నింగ్ ఇచ్చాడు. ముందుగానే ఒప్పుకున్న మొత్తాన్ని, బంగారు చైన్‌ను ఇదే రోజు.. ఇప్పుడే తనకు అప్పజెప్పాలని, అలాగైతేనే పెళ్లి చేసుకుంటానని కరాఖండిగా చెప్పేశాడు. వరుడు ప్రభుత్వ ఉద్యోగి అని, తన తండ్రి బడి పంతులు అని చెప్పాడు. దీనికి.. వీడియో తీస్తున్న వ్యక్తి స్పందిస్తూ... చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన మీరు వరకట్నం గురించి పట్టుబడటం సరైందేనా? అని ప్రశ్నించాడు. దానికి జవాబుగా.. ఇక్కడ వరకట్నం తీసుకోనిది ఎవరు? ప్రతి ఒక్కరూ వరకట్నం తీసుకుంటున్నారు. ఇవాళ నాకు ఇంకా వరకట్నం అందలేదు కాబట్టి.. మీకు తెలిసింది. లేదంటే ఈ విషయం బయటకు వచ్చేదే కాదు అని లాజిక్‌గా మాట్లాడాడు.
ఇలా వరకట్నం అందనిదే పెళ్లి చేసుకోనని ముందే చెబితే.. ఈ ఖర్చు తప్పేది కదా..? రెండు కుటుంబాల పరువూ దక్కేది కదా? అని ప్రశ్నించగా.. ఇక్కడికి వచ్చే ముందు తాను వధువు కుటుంబంతో మాట్లాడారని అన్నాడు. తనకు ముట్టజెప్పాల్సిన మొత్తం సిద్ధంగా ఉన్నదని తనకు హామీ ఇచ్చారని, తీరా ఇక్కడకు వచ్చాక లేవని తెలిసిందని చెప్పాడు. ఇప్పటికిప్పుడు తనకు వరకట్నం అందకుండా తిరిగి తమ ఇంటికి వెళ్లిపోతామని పేర్కొన్నాడు.
ఒక వేళ తాము అడిగినంత వరకట్నం ఇవ్వలేకపోతే.. తమలాంటి సంబంధాలు ఎందుకు మాట్లాడుకోవడం అని ఆ వరుడు ఎదురు ప్రశ్నించాడు. ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లను ఇవ్వాలని భావిస్తే.. అంతకు తగిన కట్నం ఇవ్వాల్సి ఉంటుందని వివరించాడు. ఇంతలో ఆ నూతన వధువు కలుగజేసుకుని ఇప్పటికే తాము కొంత ఇచ్చామని, మిగిలిన మొత్తం త్వరలోనే ఇస్తారని తమ వారు అంటున్నారు కదా? అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, లేదు లేదు.. ఇప్పుడే తనకు మొత్తం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న తండ్రీ కొడుకులు వరకట్నం గురించి హంగామా చేశారు.