భారత్‌లో కొత్తగా గ్రీన్ ఫంగస్.. మధ్యప్రదేశ్‌లో తొలి కేసు: ఊపిరితిత్తులు, రక్తం, సైనస్‌లపై తీవ్ర ప్రభావం

By Siva KodatiFirst Published Jun 16, 2021, 8:35 PM IST
Highlights

కరోనా నుంచి కోలుకున్న వారికి ఆ ఆనందం లేకుండా చేస్తోంది బ్లాక్ ఫంగస్. అధికంగా స్టిరాయిడ్స్ వాడటం, ఎక్కువ రోజులు ఐసీయూలో వుండటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గదల తదితర కారణాలతో బ్లాక్ ఫంగస్ కోవిడ్ విజేతలపై విరుచుకుపడుతోంది. 

కరోనా నుంచి కోలుకున్న వారికి ఆ ఆనందం లేకుండా చేస్తోంది బ్లాక్ ఫంగస్. అధికంగా స్టిరాయిడ్స్ వాడటం, ఎక్కువ రోజులు ఐసీయూలో వుండటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గదల తదితర కారణాలతో బ్లాక్ ఫంగస్ కోవిడ్ విజేతలపై విరుచుకుపడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ లెక్కకు మిక్కిలిగా ఈ కేసులు వున్నాయి. దీనికి అదనగా ఎల్లో, వైట్ ఫంగస్‌లను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. ఇప్పటికే వీటి బారినపడి పలువురు మరణించారు కూడా. ఈ క్రమంలో కొత్తగా గ్రీన్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. 

మధ్యప్రదేశ్‌లో ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తిలో గ్రీన్‌ ఫంగస్‌ లక్షణాలను వైద్యులు గుర్తించారు. దేశంలో ఇదే మొదటి గ్రీన్‌ ఫంగస్‌ కేసుగా డాక్టర్లు చెబుతున్నారు. ఈ కొత్త రకం ఫంగస్‌ ఆస్పెర్‌గిలోసిస్‌ ఇన్ఫెక్షన్‌ అని శ్రీ అరబిందో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌కు (ఎస్‌ఏఐఎంఎస్‌) చెందిన డాక్టర్‌ రవి దోసి తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని ఆయన వెల్లడించారు. ఆస్పర్‌గిలోసిస్‌ ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రవి దోసి తెలిపారు. 

Also Read:బ్లాక్ ఫంగస్ బాధితురాలి ఆత్మహత్య..!

గ్రీన్‌ ఫంగస్‌ సోకిన 34 ఏళ్ల వ్యక్తి రెండు నెలల కిందట కరోనా నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలో 15 రోజుల నుంచి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం, జ్వరం రావడంతో బ్లాక్‌ ఫంగస్‌ సోకిందేమోనన్న భయంతో ఆయన వైద్యులను సంప్రదించారు. వివిధ పరీక్షల అనంతరం ఆయనకు గ్రీన్‌ ఫంగస్‌ సోకినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆయన ఊపిరితిత్తులు, రక్తం, సైనస్‌లపై తీవ్ర ప్రభావం పడిందని వారు డాక్టర్లు తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌కు గ్రీన్‌ ఫంగస్‌కు వేర్వేరు ఔషధాలు ఉంటాయని డాక్టర్‌ రవి దోసి తెలిపారు. మరోవైపు బాధితుణ్ని చికిత్స కోసం ఎయిర్‌ అంబులెన్సు ద్వారా ముంబయికి తరలించారు. 

అయితే కరోనా అనంతరం మానవ శరీరంపై దాడి చేస్తున్న వివిధ రకాల ఫంగస్‌లను రంగులతో పిలవడం మానేయాలని ఎయిమ్స్ డైరక్టర్‌ రణదీప్‌ గులేరియా గతంలో సూచించారు. వీటి వల్ల ప్రజలు అయోమయానికి గురవుతారని ఆయన సూచించారు.

click me!