
Sidhu meets Mann: పంజాబ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూపై స్వంత పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ఓటమి అనంతరం సిద్ధూ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారారు. ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను కలిశారు. వీరిద్దరి మధ్య భేటీ దాదాపు 50 నిమిషాల పాటు సాగినట్టు సమాచారం. ఈ క్రమంలో పలు రాజకీయ అంశాలపై చర్చ సాగినట్టు తెలుస్తోంది.
డ్రగ్స్ నుంచి లా అండ్ ఆర్డర్ వరకు పలు అంశాలపై చర్చించినట్లు సమావేశం అనంతరం సిద్ధూ వెల్లడించారు. భేటీ సీఎం వ్యవహార శైలిని కొనియాడారు. భగవంత్ మాన్‌ను అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా సిద్ధూ అభివర్ణించారు. ముఖ్యమంత్రిని కలుస్తున్నట్లు ఒక్కసారి కూడా అనిపించలేదని అన్నారు. అతను డౌన్ టు ఎర్త్ లీడర్ అని కొనియాడారు.
సీఎంతో తన భేటీ సానుకూలంగా జరిగిందని సిద్ధూ తెలిపారు. అన్నివిషయాలను ఆయన ఓపికగా విని అర్థం చేసుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సిద్ధూ డ్రగ్స్ అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితిపై మా అభిప్రాయాలను అందించామని, డ్రగ్స్ సమస్యపై మాట్లాడామని, పోలీసులతో డ్రగ్స్ స్మగ్లర్ల మధ్య కొనసాగుతున్న అనుబంధంపై దృష్టి సారించామని తెలిపారు.
పంజాబ్‌లో ఆక్రమణలను తొలగించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మంచి పని చేసిందని సిద్ధూ ఉద్ఘాటించారు. ఈ విషయంలో సీఎం నిర్ణయాలను సమర్థించుకున్నారు. ఇవన్నీ కాకుండా, పంజాబ్‌లో మద్యం అమ్మకాలపై కూడా కాంగ్రెస్ నాయకుడు మాట్లాడారు. ఆయన దృష్టిలో కాంట్రాక్టర్ ద్వారా రాష్ట్రంలో మద్యం విక్రయించరాదని తెలిపారు.
సీఎం భగవంత్ మాన్‌తో నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ కావడం సర్వత్ర చర్చనీయంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సిద్దూపై భగ్గుమంటుంది. సోనియా గాంధీ అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్న సమాచారం. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా కూడా ఆయనకు వ్యతిరేకంగా నిరంతరం మాట్లాడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధూ .. సీఎం భగవంత్ మాన్‌తో భేటీ కావడంతో ఆయన రెండో ప్లాన్‌ని పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరే ప్రతిపాదనను తిరస్కరించినప్పుడు, అతను వెంటనే అతనిని కలుసుకున్నాడు. అతనిని తన పాత స్నేహితుడు అని కూడా పిలిచాడు. ఆ భేటీ తర్వాత ప్రశాంత్ కిషోర్‌తో సిద్ధూ చేతులు కలిపే అవకాశం ఉందని సమాచారం.
అయితే ఆ ఊహాగానాల మధ్య ఇప్పుడు సీఎం భగవంత్ మాన్‌పై బహిరంగంగానే ప్రశంసలు కురుస్తున్న్నారు. ఒకప్పుడు భగవంత్ మాన్ స్టాండ్-అప్ కామెడీ చేసే షోలో, సిద్ధూ జడ్జిగా ఉండేవారని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఉన్న అనుబంధం ఇప్పుడు రాజకీయాల్లో ఎటువైపుకు సాగుతుందో దానిపై అందరి దృష్టి పడింది.