న్యూఢిల్లీ: జార్ఖండ్‌లోని రాంచీ ఎయిర్‌పోర్టులో అవాంఛనీయ ఘటన జరిగింది. దివ్యాంగుడైన ఓ చిన్నారిని ఇండిగో విమానం ఎక్కనివ్వకుండా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ విషయమై ఎయిర్‌పోర్టులోనే ఆ కుటుంబానికి ఇండిగో సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చాలా మంది ఇండిగో సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఇండిగో సీఈవో కీలక ప్రకటన చేశారు.
ఇండిగో సీఈవో రొనొజాయ్ దత్తా ఈ ఘటనపై స్పందిస్తూ దివ్యాంగులైన తమ పిల్లల కోసం జీవితాలను ధారబోసే తల్లిదండ్రులే నిజమైన హీరోలు అని, వారిని తాము తప్పక గుర్తిస్తామని పేర్కొన్నారు. ఆ ఘటనపై తాము పశ్చాత్తాపపడుతున్నామని వివరించారు. ఆ తల్లిదండ్రులు దివ్యాంగ చిన్నారి కోసం జీవితకాలాన్ని అంకితం చేసిన గొప్ప నిర్ణయాన్ని గౌరవిస్తూ చిన్నపాటి ప్రశంసగా తాము ఆ బాలుడికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొనివ్వాలని ఆశపడుతున్నామని తెలిపారు.
రాంచీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న ఘటనపై ఇండిగో సీఈవో రొనొజాయ్ దత్తా మాట్లాడుతూ, క్లిష్టపరిస్థితులల్లో తమ విమానయాన సంస్థ తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నదని వివరించారు. తమ ప్రయాణికుల సేవనే తమకు అత్యున్నతమైనదని, దీనితోపాటు అన్ని గైడ్‌లైన్స్‌ను దృష్టిలో పెట్టుకునే తమ సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల నుంచి సమీక్ష చేసిన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో తాము అప్పటి సిచ్చువేషన్‌కు తగిన నిర్ణయాన్నే తీసుకున్నామని వివరించారు. చెకిన్, బోర్డింగ్
ప్రాసెస్‌ల నుంచి వారిని పంపించామని, ఎందుకంటే, వారిని కూడా విమానంలో తీసుకెళ్లాలనే ఉద్దేశ్యమే తమకు ఉండిందని తెలిపారు. కానీ, విమానం ఎక్కే సమయంలో దివ్యాంగ బాలుడు ఆందోళనకు గురయ్యాడని, తద్వార విమాన ప్రయాణంలో ఆ బిహేవియర్ ప్రమాదంగా మారే అవకాశం ఉన్నదని చెప్పారు.
దివ్యాంగ చిన్నారి గల కుటుంబం రాంచీ నుంచి హైదరాబాద్‌కు రావాలనుకున్నారు. వారు రాంచీ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. చెక్ ఇన్, బోర్డింగ్ ప్రాసెస్‌లు అన్నీ పూర్తి చేశారు. కానీ, తీరా విమానం ఎక్కే సమయంలో ఆ దివ్యాంగ బాలుడు కలవరానికి గురయ్యాడు. ఇది గమనించి ఇండిగో సిబ్బంది వారిని విమానం ఎక్కనివ్వకుండా వారించారు. స్థిమితం లేని చిన్నారులు.. మద్యం పుచ్చుకున్న వయోజనులతో సమానం అని, అలాంటి వారిని విమానంలోకి రానిచ్చి రిస్క్ తీసుకోలేమని సిబ్బంది తెలిపారు. ఈ విషయమై సిబ్బందికి ఆ కుటుంబానికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదాన్ని అక్కడే ఉన్న ఓ యువతి తన సోషల్ మీడియా ఖాతాలో ఆవేదనతో రాసుకొచ్చారు. ఈ పోస్టు వైరల్ అయింది.
అయితే, వారిని మొత్తానికే విమానంలోకి రానివ్వమని వారు చెప్పలేదు. ఆ బాలుడు స్థిమితపడ్డ తర్వాత విమానంలోకి తీసుకోవాలని సిబ్బంది ప్రయత్నించినట్టు తెలిసింది. కానీ, ఆ బాలుడు స్థిమితపడకపోవడంతో చివరి వరకు చూసి విమానంలోకి రానివ్వలేదు. ఆ తర్వాతి రోజు వారిని విమానంలోకి ఎక్కనిచ్చినట్టు సమాచారం.