MSP: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత ఎంఎస్పీపై క‌మిటీ !

Published : Feb 04, 2022, 01:26 PM IST
MSP: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత ఎంఎస్పీపై క‌మిటీ !

సారాంశం

MSP:ఎంఎస్‌పిపై కమిటీని ఏర్పాటు చేసే అంశం కేంద్ర మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని, ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఏర్పాటు చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.  

MSP: దేశంలో ఎన్ని ప్ర‌భుత్వాలు మారినా.. రైతులు ప‌రిస్థితుల్లో పెద్ద‌గా మార్పు రాలేద‌ని ఇప్ప‌టికే అనేక రిపోర్టులు పేర్కొన్నాయి. ఆరుగాలం క‌ష్టించి.. పండించిన పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించే ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌నీ, దీని కోసం ప్ర‌త్యేక చ‌ట్టం తీసుకురావాల‌ని రైతులు చాలా కాలం నుంచి పోరాటం సాగించారు. ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని మోడీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ కొత్త చ‌ట్టాల నేప‌థ్యంలో.. కేంద్రం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఆ మూడు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. ఉద్య‌మించ‌డంతో కేంద్రం వెన‌క్కి త‌గ్గి వాటిని ర‌ద్దు చేసింది. అయితే, రైతులు మాత్రం పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధర (Minimum Support Price-MSP) క‌ల్పించే విధంగా చ‌ట్టం తీసుకురావాల‌ని డిమాండ్ చేస్తూ.. ఉద్య‌మం కొన‌సాగించారు. అయితే, ఎంఎస్పీ చ‌ట్టంపై ప్ర‌భుత్వ హామీతో ఆందోళ‌న‌లు విర‌మించుకున్నారు. 

ఇదిలావుండ‌గా, రైతు ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన పంజాబ్ రాష్ట్రంలో ఎన్నిక‌లతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ మ‌ళ్లీ ఎన్నిక‌ల అస్త్రంగా ప్ర‌తిప‌క్షాలు ఎక్కుపెడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా కేంద్రం క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్పీ) (Minimum Support Price-MSP) పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పంట‌కు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై క‌మిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఎంఎస్పీపై ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం నాడు రాజ్యసభలో వెల్ల‌డించారు. పార్ల‌మెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక పార్ల‌మెంట్ స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌కు సమాధానమిస్తూ ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని  కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఎంఎస్పీ పై తీసుకునే నిర్ణ‌యం గురించి లేఖ రాసిందని కేంద్ర మంత్రి తోమర్ చెప్పారు. ఎంఎస్పీ(Minimum Support Price-MSP) పై  కమిటీని ఏర్పాటు చేసే అంశం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందనీ, ఐదు రాష్ట్రాల‌ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏర్పాటు చేస్తామని ఆయ‌న వెల్ల‌డించారు. 'పంటల వైవిధ్యం, సహజ వ్యవసాయం, పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్పీ)ని కల్పించే విష‌యంపై  సమర్థవంతంగా, పారదర్శకంగా చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించిన విషయం దేశం మొత్తానికి తెలుసు. ప్రధాని చేసిన ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది' అని తోమర్ చెప్పారు. ప్ర‌స్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ నేప‌థ్యంలో ప్రభుత్వం మార్గదర్శకత్వం కోసం ఈసీకి లేఖ రాసిందని తెలిపారు. 

ఇదిలావుండ‌గా, ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కార్ పదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2022 బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో  వ్యవసాయం తమ ప్రాధాన్యాల్లో ఒకటి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రబీలో గోధుమలు, ఖరీఫ్‌లో వరి సేకరిస్తున్నామన్నారు. రైతుల నుంచి 1,208 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను, అలాగే 63 లక్షల మెట్రిక్ టన్నుల వ‌రిధానాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. గోధుమ, వరి రైతులకు కనీస మద్దతు ధర (MSP) ప్ర‌కారం రూ. 2.37 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు. సుస్థిర వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంచడానికి దేశవ్యాప్తంగా రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీతారామన్ చెప్పారు. పంట అంచనా, పురుగుమందుల స్పేయింగ్ కోసం కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు భూ రికార్డుల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేస్తామని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్