
న్యూఢిల్లీ: సింగపూర్(Singapore) ప్రధాన మంత్రి ఈ రోజు ఆ దేశ పార్లమెంటు చర్చలో స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru)ను ప్రస్తావించారు. నెహ్రూ ఇండియా(Nehru's India) అంటూ పేర్కొని ప్రస్తుత ఇండియా(India)లో కొన్ని వాంఛించని మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుత లోక్‌సభలో సగం మంది చట్టసభ్యులపై నేరపూరిత అభియోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం(Objections) తెలిపింది. సింగపూర్ దౌత్య కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
నెహ్రూ ఇండియా అంటూ సింగపూర్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తప్పుపట్టిందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత చట్టసభలో సగం మంది సభ్యులపై నేరపూరిత అభియోగాలు ఉన్నాయని ఆయన పేర్కొనడం సరికాదని అభిప్రాయపడిందని వివరించాయి. ఈ వ్యాఖ్యలు ఆమోదనీయం కావని, ఈ అంశాన్ని తాము సింగపూర్‌తో చర్చిస్తామని పేర్కొన్నట్టు తెలిపాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సింగపూర్ దౌత్యకార్యాలయానికి భారత విదేశాంగ శాఖ సమన్లు పంపినట్టు పేర్కొన్నాయి.
సింగపూర్ పార్లమెంటులో నిన్న జరిగిన ఓ చర్చలో ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి? అది ఎలా ఫంక్షన్ చేయాలి అనే అంశంపై సింగపూర్ పీఎం లీ సియెన్ లూంగ్ మాట్లాడారు. చాలా దేశాలు ఉన్నత విలువలు, ఆదర్శాలే పునాదిగా ఏర్పడ్డాయని వివరించారు. కానీ, మెల్లగా దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ రాజకీయాల అర్థం మారిపోతున్నదని, రాజకీయ నేతలపై ఉన్న గౌరవం కరిగిపోతున్నదని అన్నారు. ఇదే సందర్భంలో ఆయన నెహ్రూ ఇండియా అంటూ మాట్లాడారు. నెహ్రూ పీఎంగా సేవలు అందించిన భారత్‌లోని లోక్‌సభలో సగం మంది చట్టసభ్యులపై నేరపూరిత అభియోగాలు ఉన్నాయని అన్నారు. ఇందులో హత్య, అత్యాచార అభియోగాలూ ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో చాలా అభియోగాలు రాజకీయ ప్రేరేపితమైనవిగానే ఉన్నాయని వార్తా కథనాల ద్వారా తెలుస్తున్నదని వివరించారు.
స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సహా మరెందరో ప్రపంచ దేశాల నేతల గురించి ఆయన మాట్లాడారు. తొలుత ఈ చర్యలు అన్నీ ఎంతో ఉత్సుకతతో, ఆవేశంతో మొదలయ్యాయని వివరించారు. ఆ నేతలు తమ దేశాల కోసం పోరాడారని, స్వాతంత్ర్యం సంపాదించారని చెప్పారు. వారందరిలో గొప్ప ధైర్యం, సంస్కృతిపై ప్రేమ, సామర్థ్యాలు ఉన్నాయని తెలిపారు. వారంతా ఎన్నో క్లిష్టపరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొని నాయకులుగా ఎదిగారని, ప్రజల అంచనాలకు, ప్రజల కలలను సాకారం చేయాలనే గొప్ప పట్టుదలతో వారు నేతలుగా ఎదిగారని వివరించారు. డేవిడ్ బెన్ గురియన్స్, జవహర్‌లాల్ నెహ్రూలు ఇలాంటి నేతల్లో ఉన్నారని, తమ దేశంలోనూ ఈ కోవలోకి చేరే నాయకులు ఉన్నారని తెలిపారు.
వ్యక్తిగత ప్రతిష్టలు, స్వాభిమానం నింపుకున్న నేతలు ఆ దేశ ప్రజల అంచనాలను అందుకుంటారని, ఒక కొత్త ప్రపంచం వారి కోసం సృష్టిస్తారని తెలిపారు. వారి దేశాలకు ఒక కొత్త భవిష్యత్‌ను నిర్మించాలని వివరించారు. అయితే, తొలితరం నేతలు అంత ఆదర్శంగా నిలిచినా.. దశాబ్దాల తర్వాత నేతల వ్యవహారంలో, నడవడికలో మార్పులు వస్తాయని తెలిపారు. అప్పటి ఆదర్శాలను ఎత్తిపట్టుకోవడం సవాలుతో కూడుకున్నట్టిదిగా మారుతుందని చెప్పారు.