
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) అజాతశత్రువు అని పేరు. విపక్షాల్లోని నేతలతోనూ ఆయన సత్సంబంధాలను నెరిపేవారు. ఎంత వైరి ఉన్నప్పటికీ ఆయన మాటలతో అందరినీ కలుపుకుపోయేవారు. ఆయన వాగ్దాటి కూడా అమోఘంగా ఉండేది. అంతే ధైర్యవంతుడు కూడా. భారత్‌తో ఎప్పుడూ కయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నించే పాకిస్తాన్‌తోనూ ఆయన సుహృద్భావనతోనే మెదిలారు. ఓ సందర్భంలో ఆయన పాకిస్తాన్ వెళ్లారు. పాకిస్తాన్(Pakistan)లోనే ఆయనలోని ఈ యుక్తులను వెల్లడించే ఓ ఘటన జరిగింది. ఆ ఘటనను ఇప్పటికీ చాలా మంది కథలు కథలుగా చెప్పుకుంటుంటారు.
అది 1999 మార్చి 16వ తేదీన జరిగింది. అటల్ బిహార్ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి పాకిస్తాన్‌లోని లాహోర్‌కు రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఈ మార్గం ఫలితంగా కొంత మెరుగుపడుతాయని ఆశించారు. ఒక సారి ప్రధాన మంత్రి అటల్ బిహార్ వాజ్‌పేయి స్వయంగా ఆ మార్గం గుండా పాకిస్తాన్‌కు వెళ్లారు. ఆయన పాకిస్తాన్‌లోని గవర్నర్ హౌజ్ ప్రసంగించారు. ఆ సమయంలో ఓ మహిళా రిపోర్టర్ ఆశ్చర్యకర, అనూహ్యమైన ప్రశ్న వేసింది. అందుకు అటల్ బిహార్ వాజయ్‌పేయి దీటైన సమాధానం చెప్పి సభికులందరినీ కొంత సేపు దిగ్భ్రమలో ముంచారు.
అటల్ బిహార్ వాజ్‌పేయి గారు.. మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అని పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళా విలేకరి(Female Journalist) ప్రశ్నించారు. తాను వాజ్‌పేయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నదని అన్నారు. అయితే, అందుకు ఒక షరతు పెట్టింది. తాను వాజ్‌పేయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఒక తంతులో భాగంగా ముఖాన్ని చూపించడానికి కట్నంగా కశ్మీర్(Kashmir)ను పాకిస్తాన్‌కు ఇస్తారా? అని అడిగారు. ఈ ప్రశ్నతో హాల్ అంతా ఖంగు తిన్నది. ఇలాంటి ప్రశ్నను ఎవరూ ఊహించలేదు. భారత్ నుంచి పాకిస్తాన్ వేరుపడ్డప్పటి నుంచి కశ్మీర్ వివాదం కొనసాగుతూనే ఉన్నది. రెండు దేశాల మధ్య ఘర్షణలకు, వైరానికి కేంద్రబిందువుగా కశ్మీరే ఉన్నది. అలాంటి కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇచ్చేస్తారా? అని ప్రశ్నించడం సభలో వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. అయితే, అటల్ బిహార్ వాజ్‌పేయి ధైర్యం, వాక్చాతుర్యం ఇక్కడే మరోసారి బయటికి వచ్చింది.
సరే.. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ. కానీ, నాకు కూడా ఒక షరతు ఉన్నది. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు వరకట్నం(Dowry)గా మొత్తం పాకిస్తాన్‌ను ఇచ్చేస్తారా? అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ నడిబొడ్డులో ఆ దేశాన్ని ఇచ్చేస్తారా? అని ఆయన అడగడం మరోసారి సభికులను షాక్‌కు గురి చేసింది. ఈ వ్యాఖ్యలతో ఆ మహిళా జర్నలిస్టు గొంతులో వెలక్కాయ పడినట్టయింది.
ఈ ఉదంతాన్ని ఇప్పటికీ పలువురు చర్చకు తెస్తుంటారు. అటల్ బిహార్ వాజ్‌పేయి వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి మాత్రమే కాదు.. ఆయన గుండె ధైర్యాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు.