
Union Law Minister Kiren Rijiju On Judiciary: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి న్యాయవ్యవస్థ స్వతంత్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను మోడీ ప్రభుత్వం బలహీనపరచలేదని అన్నారు. ప్రతి సంస్థ 'లక్ష్మణ రేఖ'ను లేదా రాజ్యాంగం నిర్దేశించిన పరిమితిని గౌరవించాలని తెలిపారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరిగిన బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గోవా కార్యక్రమంలో కిరణ్ రిజిజు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. "న్యాయవ్యవస్థ స్వతంత్రతను విడిగా చూడలేము. కార్యనిర్వాహక స్వాతంత్య్రం, శాసనసభకు స్వాతంత్య్రం ఉండాలి. మన రాజ్యాంగంలో అధికారాల విభజన ఉంది.. ప్రతి సంస్థ రాజ్యాంగం నిర్దేశించిన 'లక్ష్మణ రేఖ' లేదా సరిహద్దును గౌరవించాలి" అని కిరణ్ రిజిజు అన్నారు.
న్యాయవ్యవస్థపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోందనే వాదనలను ఆయన ఖండించారు. న్యాయవ్యవస్థపై ప్రభుత్వం ఏదో రకమైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందనేది అపోహ అని తెలిపారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడటమే కాకుండా దాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఉదారవాదులమని చెప్పుకునే కొందరు ఈ అపోహను ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నారనీ, అయితే ఇది ఎంతమాత్రం నిజం కాదని న్యాయమంత్రి అన్నారు.
కిరణ్ రిజిజు ఇంకా ఏమన్నారంటే..
న్యాయవ్యవస్థ పనితీరులో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందా అన్న ప్రశ్నకు రిజిజు సూటిగా సమాధానమిస్తూ, ప్రభుత్వ పనిలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటోందా అనే ప్రశ్నను అడగవచ్చని అన్నారు. మన రాజ్యాంగం ప్రతి సంస్థకు 'లక్ష్మణ రేఖ' అని చెబుతోందనీ, ఈ పంథాను గౌరవించాలన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరి పరిధిని నిర్దేశించింది కాబట్టి న్యాయవ్యవస్థ స్వతంత్రతను, కార్యనిర్వాహక స్వతంత్రతను, చట్టసభల స్వతంత్రతను వేరుగా ఉంచలేమని తెలిపారు. కాలంతో పాటు ప్రభుత్వం మారాలి, కాలంతో పాటు న్యాయవ్యవస్థ మారాలని వ్యాఖ్యానించారు.
భారతీయ భాషాభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి..
భాష ప్రధానమైన అంశమైన వలసవాద శకాన్ని మనం క్రమంగా అంతం చేయాల్సిన అవసరం ఉందని న్యాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. "మన భారతీయ న్యాయస్థానాల్లో భారతీయ భాషను ఎందుకు ఉపయోగించకూడదు? మహారాష్ట్ర న్యాయస్థానాల్లో మరాఠీ మాట్లాడినట్లే మన భారతీయ భాషను ప్రోత్సహించాలి. ఏ భాషనైనా నేర్చుకోవడం తప్పు కాదు, కానీ మన ఆలోచనా విధానాన్ని హిందుస్తానీగా ఉంచుకోవాలి. మనం జాతీయవాదులమనీ, భారతీయులంతా కలిసి ఆలోచించినప్పుడే దేశం బలోపేతమవుతుందని" తెలిపారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం ఆలోచించాలి..
మీరు ఆ దిశగా ఆలోచిస్తారని సుప్రీంకోర్టులో కూడా చెప్పామని ఆయన చెప్పారు. "దీనిపై ప్రభుత్వానికి స్పష్టమైన ఉద్దేశం ఉంది. మా వద్ద సాంకేతిక పరిజ్ఞానం ఉంది. కాబట్టి మన ప్రాంతీయ భాషను కోర్టుల్లో ఎందుకు ఉపయోగించకూడదు. ఈ దిశగా సుప్రీంకోర్టు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను బుద్ధ భగవానుడి నుండి శక్తిని పొందుతాను.. నేను ఏదైనా నిర్భయంగా చేసినప్పుడల్లా, నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ నుండి ఆ శక్తిని పొందుతానంటూ" వ్యాఖ్యానించారు.
దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి..
పెరుగుతున్న కోర్టు కేసుల సంఖ్య దేశానికి అతిపెద్ద ఆందోళన అనీ, దీనికి పరిష్కారం సాంకేతిక పరిజ్ఞానంలో ఉందని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. "మన దేశంలో దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో న్యాయం ఆలస్యమవుతోంది. ఆన్ లైన్ విచారణలు, ఈ-ఫైలింగ్ ను ప్రోత్సహించేందుకు సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చర్యలు తీసుకుంటున్నారని" తెలిపారు. అదే సమయంలో బడ్జెట్ న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశం కాదని ఆయన అన్నారు.