రైల్వేస్టేషన్‌‌లో పట్టాలు తప్పి గూడ్స్ రైలు.. ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన వ్యాగన్లు.. ముగ్గురు మృతి

By Sumanth KanukulaFirst Published Nov 21, 2022, 9:54 AM IST
Highlights

ఒడిశాలోని జాజ్‌పూర్‌లోని కొరై రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. వ్యాగన్లు ప్లాట్‌ఫామ్‌పై పడటంతో ముగ్గురు మృతిచెందారు. 

ఒడిశాలోని జాజ్‌పూర్‌లోని కొరై రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. వ్యాగన్లు ప్లాట్‌ఫామ్‌పై పడటంతో ముగ్గురు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. సోమవారం ఉదయం 6.44 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జాజ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ పిఆర్ మాట్లాడుతూ.. స్టేషన్‌లో బలావోర్-భువనేశ్వర్ రైలు ఎక్కేందుకు అనేక మంది ప్రయాణికులు వేచి ఉండగా, ఆ మార్గంలో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని తెలిపారు. 

“ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఒక చిన్నారితో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బోగీల కింద ప్రజలు చిక్కుకుయి ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. దీని గురించి మేము ఆందోళన చెందుతున్నాం. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది’’అని ఆయన చెప్పారు. ఇక, గూడ్స్ రైలులోని మొత్తం 54 వ్యాగన్‌లలో ఎనిమిది స్టేషన్‌లోకి దూసుకెళ్లినట్టుగా రైల్వే అధికారులు చెప్పారు.

సాధారణంగా గూడ్స్ రైలు స్టేషన్ మీదుగా వెళ్లే సమయంలో వేగం తగ్గుతుందని.. అయితే దాని వేగం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం చాలా తీవ్రంగా ఉందిని చెప్పారు. కొన్ని బండ్లు స్టేషన్‌లోని ఫుట్‌బ్రిడ్జ్‌ను కూడా ఢీకొట్టాయని ఒక అధికారి తెలిపారు. స్టేషన్ భవనంలోని కొంత భాగం కూడా దెబ్బతిందని చెప్పారు.

ఘటన స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయడానికి రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేయడానికి, వారికి సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్సను అందించడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి, బాధ్యతను నిర్ధారించడానికి విచారణ చేపట్టనున్నట్టుగా చెప్పారు.

click me!