
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. బంగారం ధర వరసగా నాలుగు రోజుల పాటు పెరిగి రూ.32వేల మార్క్ ని చేరింది. శనివారం నాటి మార్కెట్లో రూ.100 పెరిగి పది గ్రాముల పసిడి ధర రూ.32,050కి చేరింది. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తుతుండటంతో ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ 41వేల మార్క్‌ను దాటింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నేటి బులియన్ మార్కెట్లో వెండి ధర రూ. 100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 41,100కు చేరింది. అంతర్జాతీయంగానూ ఈ లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో 0.17శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1,299డాలర్లు పలికింది. 0.60శాతం పెరిగి ఔన్సు వెండి ధర 16.77గా ఉంది.