
Goa Election News 2022 : గోవాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. దీంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఒక పార్టీ నుంచి నాయకులు మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. అన్ని పార్టీలు తమ బలా బలాలు లెక్క బెట్టుకున్నాయి. ఎన్నికలకు మరో 20 రోజులు సమయం మాత్రమే ఉండటంతో ఈ సమయంలో చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బీజేపీ (bjp) కి గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (manohar parikar) కుమారుడు ఉత్పల్ పారికర్ (uthpal parikar) వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇటీవలే ఆ పార్టీ నుంచి రాజీనామా చేసిన ఉత్పల్ స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించాడు. అయితే ఆయన పనాజీ నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. నేడు ఉత్పల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయనను తిరిగి తీసుకొచ్చేందుకు, పోటీ చేయనీయకుండా ఉంచేందుకు ఉత్పల్ తో బీజేపీ చర్చలు జరిపినప్పటికీ అవేవీ ఫలించలేదు. ఆయన పనాజీ నుంచి రంగంలోకి దిగాలనే భావిస్తున్నారు.
వచ్చే నెలలో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రెండు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహించిన పనాజీ (panjai) నియోజకవర్గం నుంచి ఉత్పల్ పారికర్ పోటీ చేయాలని భావించారు. అయితే ఆ స్థానం నుంచి బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన పార్టీకి గత వారం రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్టు చెప్పారు. బీజేపీని వీడటం అత్యంత కష్టమైన నిర్ణయమని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఈ పనాజీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సెరేట్ (atanasia monserate)ను బీజేపీ (bjp) పోటీలో నిలిపింది. ఆయన జూలై 2019లో కాంగ్రెస్‌ను వీడి కాషాయ పార్టీలో చేరిన పది మంది శాసనసభ్యులలో ఒకరుగా ఉన్నారు. మోన్సెరేట్ మైనర్‌పై అత్యాచారం కేసుతో సహా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే పనాజీ నియోజకవర్గం విషయంలో చర్చ జరుగుతుండటంతో ఆయన స్పందించారు. ఉత్పల్ పారికర్ ను పనాజీ నుంచి కాకుండా ఇతర ఏ స్థానం నుంచి అయినా పోటీ చేయాలని పార్టీ సూచించిందని తెలిపారు. అయితే దీనికి ఆయన ఒప్పుకోలేదని అన్నారు.
బీజేపీ కి రాజీనామా చేసిన మరుసటి రోజే ఉత్పల్ పారికర్ భావోద్వేగంతో మీడియాతో మాట్లాడారు. పనాజీ (panaji) నియోజకవర్గం నుంచి మోన్సెరేట్ కాకుండా వేరే మంచి అభ్యర్థిని నిలబెడితే తాను ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. బీజేపీ (bjp) ఎప్పుడూ తన హృదయంలో ఉంటుందని అన్నారు. పార్టీ ఆత్మ కోసం తాను పోరాడుతున్నానని చెప్పారు. 1994లో తన తండ్రిని పార్టీ నుంచి గెంటేయడానికి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో మనోహర్ పారికర్ (maohar parikar) కు ప్రజల మద్దతు లభించినందున అతన్ని బయటకు తీయలేకపోయారు” అంటూ ఉత్పల్ పారికర్ తెలిపారు. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి రెండో విడతలో ఫిబ్రవరి 14వ తేదీన ఒకే రోజు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.