
గోవాలో (goa) ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. బీజేపీ (bjp)కి చెందిన మైఖేల్ లోబో (Michael Lobo) తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి సోమవారం రాజీనామ చేశారు. దీంతో వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలకు ముందు ప్రమోద్ సావంత్ (pramod savanth) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగినట్లయ్యింది.
మైఖేల్ లోబో కలంగుటే (kalagunte) అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నారు. ఆయన బీజేపీ నేతృత్వంలోని గోవా ప్రభుత్వంలో సైన్స్, టెక్నాలజీ, వ్యర్థాల నిర్వహణ మంత్రిగా పనిచేశారు. తన రాజీనామ లేఖను సీఎం ఆఫీసుతో పాటు అసెంబ్లీ స్పీకర్ కు అందజేవారు. “నేను నా ఎమ్మెల్యే, మంత్రి పదవికి, అలాగే బీజేపీకి కూడా రాజీనామా చేశాను’’ అని ఆయన మీడియాతో అన్నారు. తరువాత ఏ పార్టీలో చేరుతారనే విషయంలో మైఖేల్ లోబో స్పందించారు. ‘‘ తరువాత ఏ పార్టీలో చేరాలనే విషయంలో ఆలోచిస్తున్నాను. నేను ఇతర రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నాను. ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని చూసే విధానం వల్ల నేను కలత చెందాను. పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉన్నారు’’ అని ఆయన తెలిపారు. కోస్తా రాష్ట్రంలోని ప్రజలు అధికార బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని మైఖేల్ లోబో అన్నారు. గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (manohar parikar) ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం లేదని, ఆయనకు మద్దతు తెలిపిన వారిని బీజేపీ పక్కన పెట్టిందని ఆరోపించారు. బీజేపీ సామాన్యుల పార్టీ కాదని చాలా మంది ఓటర్లు తనతో చెప్పారని విమర్శించారు. పార్టీ కింది కార్యకర్తలను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా మైఖేల్ లోబో ఈరోజే కాంగ్రెస్ (congress) పార్టీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 40 మంది శాసన సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గోవాలో బీజేపీ, కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీ (GFP), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC), ఎన్‌సీపీ (NCP) ఎన్నికల రేసులో కీలక రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. గోవాలో ప్రస్తుతం బీజేపీ అధికార పార్టీగా ఉంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీలు ఇతర మిత్రపక్షాల సహకారం పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
మారుతున్న రాజకీయ పరిణామాలు..
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ పార్టీల నుంచి రాజీనామాలు, ఒక పార్టీ నుంచి మరొక పార్టీలకు మారిపోతున్నారు. కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం టీఎంసీకి చెందిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే లావూ మమ్లేదార్‌తో సహా ఐదుగురు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందు వారం రోజుల ముందే బీజేపీకి చెందిన మరో ఎమ్మెల్యే కార్లోస్ అల్మైదా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల తేదీ సమీపించిన కొద్దీ ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.