goa assembly election 2022 : కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వారిని మళ్లీ పార్టీలో చేర్చుకోం- చిదంబరం

By team teluguFirst Published Jan 23, 2022, 3:54 PM IST
Highlights

గోవాలో కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన వారిని మళ్లీ చేర్చుకోబోమని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే 36 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశామని అన్నారు. 

goa assembly election 2022 : గోవా అసెంబ్లీకి ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి. దీంతో పొలిటిక‌ల్ హీట్ ఎక్కువ‌వుతోంది. బీజేపీకి మ‌నోహ‌ర్ పారిక‌ర్ కుమారుడు ఉత్ప‌ల్ పారిక‌ర్ వ్య‌వ‌హారం త‌ల‌నొప్పిగా మారింది. ఆయ‌న త‌న తండ్రి ప్రాతినిథ్యం వహించిన ప‌నాజీ స్థానం నుంచి సీటు ఆశిస్తున్నారు. కానీ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూష్ మోన్సరేట్ కు బీజేపీ కేటాయించింది. దీంతో ఉత్ప‌ల్ పార్టీకి రాజీనామా చేశారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయ‌న‌కు అన్ని బీజేపీయేతర పార్టీలు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాయి. 

ఎన్నికల‌కు ముందు స‌మ‌యంలోనే గోవాలోని ఒక రాజ‌కీయ పార్టీ నుంచి మ‌రో రాజ‌కీయ పార్టీలోకి నాయ‌కులు జంప్ అయ్యారు. ఇందులో తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీ (TMC)కి చెందిన నాయ‌కులు, అలాగే కాంగ్రెస్ నాయ‌కులు ఉన్నారు. అయితే ఇప్పుడు సీట్ల కేటాయింపుల్లో భాగంగా అసంతృప్తులు చెల‌రేగ‌డంతో మ‌ళ్లీ పాత పార్టీల్లోకి రావాల‌ని చూస్తున్నారు. అధికార బీజేపీ నుంచి కూడా పలువురు నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీ మారారు. 

అయితే, కాంగ్రెస్ (congress) పార్టీ నుంచి వెళ్లి పోయిన వారి విష‌యంలో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబ‌రం (Former minister chidhambaram) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ను విడిచి వెళ్లిన నాయ‌కులెవ‌ర్నీ తిరిగి పార్టీలోకి తీసుకోబోమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గోవా అసెంబ్లీలో 37 మంది అభ్యర్థుల‌కు  36 మందిని ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ ప్రకటించిందని తెలిపింది. ఆ చివరి సీటుకు కూడా త్వరలోనే పేరు ప్రకటిస్తామని ఆయ‌న చెప్పారు. ‘‘ కాంగ్రెస్ పార్టీలో నాకు చాలా నిరాడంబరమైన పదవి ఉంది. పార్టీ నుంచి ఫిరాయించిన ఎవరైనా తిరిగి తీసుకోబడరు’’ అని చిదంబరం చెప్పినట్టు ఓ మీడియా సంస్థ తెలిపింది. 

గోవాలో (goa)  2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై 17 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇందులో 15 మంది వివిధ పార్టీల‌కు జంప్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే చిదంబరం వ్యాఖ్య‌లు చేశారు. గోవాలో గోవా అసెంబ్లీలో 40 మంది శాసనసభ స‌భ్యుల‌ను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

గోవాలో ప్ర‌స్తుతం బీజేపీ (bjp)  అధికార పార్టీగా ఉంది. కాంగ్రెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా ఈ రెండు పార్టీ మ‌ధ్యే ప్ర‌ధానంగా పోటీ ఉండే అవ‌కాశం ఉంది. అయితే ఇక్క‌డ ఈ సారి తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేయాల‌ని భావిస్తోంది. గోవాలో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి లుయిజిన్హో ఫలేరోను పార్టీలోకి తీసుకొని రాష్ట్రంలోకి ప్రవేశించింది. దీంతో పాటు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) కూడా గోవా ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లోనే రంగ ప్ర‌వేశం చేసిన‌ప్ప‌టికీ గోవా ప్ర‌జ‌ల మ‌న‌సును దోచుకోలేక‌పోయింది. అయితే సారి మాత్రం మొద‌టి నుంచి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తోంది. దీని కోసం అర‌వింద్ కేజ్రీవాల్ స్వ‌యంగా రంగంలోకి దిగి ప్ర‌చారం చేస్తున్నారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో (menifesto) విడుద‌ల చేసింది. 
 

click me!