goa assembly election 2022 : పనాజీలో మంచి అభ్య‌ర్థిని నిల‌బెడితే పోటీ నుంచి త‌ప్పుకుంటా - ఉత్ప‌ల్ పారిక‌ర్

By team teluguFirst Published Jan 22, 2022, 3:26 PM IST
Highlights

పనాజీ నియెజకవర్గం నుంచి బీజేపీ మంచి అభ్యర్థిని నిలిబెడితే తాను పోటీ నుంచి తప్పుకుంటానని ఉత్పల్ పారికర్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. బీజేపీ ఎప్పుడూ తన హృదయంలో ఉంటుందని చెప్పారు. 

గోవా (goa) అసెంబ్లీకి ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుకున్న కొద్దీ రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోతున్నాయి. బీజేపీ (bjp) నాయ‌కుడు, దివంగ‌త ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ (manohar parikar) కుమారుడు ఉత్ప‌ల్ పారిక‌ర్ (uthpal parikar)  పార్టీకి రాజీనామా చేయ‌డం గోవా రాజకీయాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ప‌నాజీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డానికి బీజేపీ అవ‌కాశం ఇవ్వ‌కపోవ‌డంతో పార్టీకి రాజీనామా చేసి, స్వ‌తంత్రంగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించ‌కున్నారు. ఈ విష‌యాన్ని నిన్న ప్ర‌క‌టించారు. ఆయ‌న‌కు బీజేపీయేత‌ర పార్టీల‌న్నీ మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాయి. 

ఇదిలా ఉండ‌గా, రాజీనామా చేసిన ఒక రోజు తరువాత ఉత్ప‌ల్ పారిక‌ర్ స్పందించారు. పనాజీ (panaji)  నియోజకవర్గం నుంచి బీజేపీ మంచి అభ్యర్థిని నిలబెడితే తాను ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఆయ‌న ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడారు. బీజేపీ (bjp) ఎప్పుడూ త‌న హృదయంలో ఉంటుందని అన్నారు. పార్టీ ఆత్మ కోసం తాను పోరాడుతున్నానని చెప్పారు. 1994లో తన తండ్రిని పార్టీ నుంచి గెంటేయడానికి ఇలాంటి ప్రయత్నాలు జ‌రిగాయని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో కొనసాగుతున్న వారికి నేను ఏం చెబుతున్నానో అర్థం అవుతుంది. ఆ సమయంలో మనోహర్ పారికర్‌ (maohar parikar) కు ప్రజల మద్దతు లభించినందున అతన్ని బయటకు తీయలేకపోయారు” అని అన్నారు. 2019 పనాజీ ఉపఎన్నికను ప్రస్తావిస్తూ.. తండ్రి మరణానంతరం ప్ర‌జ‌ల మద్దతు త‌న‌కు ఉన్నప్పటికీ ఆ సమయంలో కూడా టిక్కెట్ నిరాకరించారని చెప్పారు. అయితే తాను నిర్ణయాన్ని గౌరవించాన‌ని అన్నారు. 

వచ్చే నెలలో గోవా అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దివంగ‌త ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ రెండు ద‌శాబ్దాల‌కు పైగా ప్రాతినిధ్యం వ‌హించిన ప‌నాజీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఉత్ప‌ల్ పారిక‌ర్ పోటీ చేయాల‌ని భావించారు. అయితే ఆ స్థానం నుంచి బీజేపీ టికెట్ నిరాక‌రించింది. దీంతో ఆయ‌న పార్టీకి శుక్ర‌వారం రాజీనామా చేసి, స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రంగంలోకి దిగుతున్న‌ట్టు చెప్పారు. బీజేపీని వీడ‌టం అత్యంత క‌ష్ట‌మైన నిర్ణ‌య‌మని ఆయ‌న రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు.  

ఈ ప‌నాజీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సెరేట్‌ (atanasia monserate)ను బీజేపీ (bjp) పోటీలో నిలిపింది. ఆయ‌న జూలై 2019లో కాంగ్రెస్‌ను వీడి కాషాయ పార్టీలో చేరిన పది మంది శాసనసభ్యులలో ఒకరుగా ఉన్నారు. మోన్సెరేట్ మైనర్‌పై అత్యాచారం కేసుతో సహా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే ప‌నాజీ నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో చ‌ర్చ జ‌రుగుతుండ‌టంతో ఆయ‌న స్పందించారు. ఉత్ప‌ల్ పారిక‌ర్ ను ప‌నాజీ నుంచి కాకుండా ఇతర ఏ స్థానం నుంచి అయినా పోటీ చేయాల‌ని పార్టీ సూచించింద‌ని తెలిపారు. అయితే  దీనికి ఆయన ఒప్పుకోలేదని అన్నారు. ఉత్పల్ బీజేపీకి రాజీనామా చేసి, స్వతంత్రంగా పోటీ చేసే నిర్ణయంపై మోన్సెరేట్ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఆయన తండ్రి జీవించి ఉంటే.. ఇలా జరగడానికి ఆయన ఎప్పటికీ ఒప్పుకునేవారు కారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని అన్నారు. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి రెండో విడ‌త‌లో ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన ఒకే రోజు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. 
 

click me!