
కర్ణాటక : ప్రియుడితో ఖర్చులు పెట్టించడం కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ కి బాగా అలవాటు. ఫోన్ రీ చార్జింగ్ ల దగ్గర నుంచి.. పబ్బుల ఖర్చు వరకు విపరీతంగా ఖర్చు పెట్టిస్తుంటారు. దీంతో గర్ల్ ఫ్రెండ్ ను మెయింటేన్ చేయడానికి అష్టకష్టాలు పడుతుంటారు సదరు బాయ్ ఫ్రెండ్స్. అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ మరో అడుగు ముందుకు వేసి.. ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో దొంగతనాలు చేయించింది. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. తామిద్దరూ జల్సాలు చేయడానికి ప్రియుడి వద్ద డబ్బులు లేకపోవడంతో ప్లాన్ వేసి మరి ప్రియురాలు అతడితో చోరీలు చేయించింది.
ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగింది. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బెంగళూరుకు చెందిన దీక్షితా, మధులు ప్రేమించుకున్నారు. అయితే, మెడిసిన్ చదువుతున్న మధు వద్ద డబ్బులు లేకపోవడంతో దీక్షిత ఒక ప్లాన్ చేసింది. బెంగళూరు ఉత్తర తాలూకా నెలగదిరినహళ్లి గ్రామంలోని తన పెద్దప్ప తిమ్మేగౌడ ఇంట్లో చోరీ చేయాలని సూచించింది. అదే ఇంట్లో మధు అద్దెకు ఉంటున్నాడు. తిమ్మేగౌడ ఇంట్లో రూ. లో90వేల నగదు, రెండు వందల గ్రాముల బంగారం చోరీ చేశారు.
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొని 8 మంది మృతి
చోరీ విషయం గుర్తించిన తిమ్మేగౌడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో మధు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో మధును విచారించగా అసలు విషయం వెల్లడించాడు. ప్రియురాలు పథకంతోనే.. తాను చోరీ చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీంతో చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. లవర్స్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు.