
ఉత్తర ప్రదేశ్ : కొత్త ప్రియుడి మోజులో పాత ప్రియుడిని అత్యంత దారుణంగా హతమార్చింది ఓ ప్రియురాలు. నేటి కాలంలో ప్రేమా, పెళ్లి అనేది జీవిత కాలపు బంధాలుగా కాకుండా.. టైంపాస్ వ్యవహారాలుగా మారుతున్నాయి. ఒకరిని ప్రేమించి కొద్ది రోజుల తర్వాత నచ్చక బంధానికి బ్రేకప్ చెప్పుకోవడం ఒక పద్ధతి.. కానీ దీన్ని దాటి ఆ వ్యక్తినే పూర్తిగా అంతమొందించాలని ప్రయత్నిస్తున్నారు. హత్యలు చేస్తూ నేరస్తులుగా మారుతున్నారు. ప్రియుడిని ప్రియురాలు.. ప్రియురాలిని ప్రియుడు వదిలించుకునే నేపథ్యంలో నేరస్తులుగా మారి జీవితకాల శిక్ష అనుభవిస్తున్నారు.
అలాంటి ఓ ఘటనే ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది. ఓ ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు… ఆ తర్వాత కొంతకాలానికి వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రియురాలు విడిపోదామని కోరింది. అతనితో ముభావంగా ఉండసాగింది. కానీ ప్రియుడు మాత్రం తననే ప్రేమించాలంటే వెంటపడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెకు మరో వ్యక్తి పరిచయమయ్యాడు. అతనితో ప్రేమలో పడింది.
బీహార్‌లో దారుణం: ఆసుపత్రికి వచ్చిన వ్యక్తిపై కాల్పులు, బాధితుడికి చికిత్స
కానీ మాజీ ప్రేమికుడు మాత్రం ఆమెను వదలలేదు. ఫోన్లు చేస్తూ, కలవమంటూ వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో కొత్తగా ప్రేమలో పడిన ప్రేమికుడితో కలిసి మాజీ ప్రేమికుడిని హతమార్చింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…ఘాజీపూర్ లోని నందగంజి పరిధిలో ఉన్న స్థానిక తారావు గ్రామానికి చెందిన మనీష్ అనే యువకుడికి, వైజాగ్ ప్రాంతానికి చెందిన మీనా అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఒక అభిప్రాయాలు ఒకరికి నచ్చి ప్రేమికులుగా మారిన వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే కొద్దికాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలోనే మీనూ, మనీష్ ను దూరం పెట్టసాగింది. కొద్ది కాలం తర్వాత ఆమెకి రాజేష్ అనే యువకుడు పరిచయమయ్యాడు. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే, మనీష్ మాత్రం మీనూను మర్చిపోలేక పదేపదే వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు.
ఫోన్లు చేయడం, కలుద్దామంటూ విసిగించేవాడు. ఎంత చెప్పినా మనీష్ వినకపోవడంతో మీనూ ఈ విషయాన్ని కొత్త బాయ్ ఫ్రెండ్ అయిన రాజేష్ కి తెలిపింది. ఈ సమస్య నుండి బయటపడాలంటే మనీష్ ను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. అతనిని అంతమొందించాలని కుట్రపన్నారు. దీంట్లో భాగంగానే ఆగస్టు 28వ తేదీన మీనూ, మనీష్ కి ఫోన్ చేసింది. బయటికి షికారుకు వెళ్దామని తెలిపింది. దీంతో సంతోషపడిన మనీష్ వెంటనే రెడీ అయిపోయాడు.
అప్పటికే వారు వెళ్లాలనుకున్న కారులో రాజేష్ డ్రైవర్ వేషంలో రెడీగా ఉన్నాడు. వారిద్దరూ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన తర్వాత.. మనీష్ కి మద్యం తాగించారు. ఆ తర్వాత డ్రైవర్ వేషంలో ఉన్న రాజేష్, మీనూ మనీష్ ను హతమార్చారు. సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు మీనూ, రాజేష్ లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.