
బీహార్ : బీహార్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ఐదుగురు చిన్నారులు చెరువులో మునిగి మృతి చెందారు. ఔరంగాబాద్ జిల్లాలోని సలాయ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోనార్చాక్ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ గ్రామంలోని చిన్నారులంతా రాఖీ సందర్భంగా తమ అక్క చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్నారు.
రక్షాబంధన్ వేడుక ముగిసిన తర్వాత గ్రామానికి సమీపంలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ చెరువులో స్నానం చేయడానికి దిగారు. అయితే చిన్నారులు దిగిన ప్రాంతంలో చెరువు కాస్త లోతుగా ఉంది. అది గమనించుకోకపోవడంతో నీటిలో మునిగిపోయారు. విషయం తెలిసిన గ్రామస్తులు చిన్నారుల మృతదేహాలను వెతికి వెలికి తీశారు. సమాచారం పోలీసులకు అందించడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.