
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా మారిన అతీఖ్ అహ్మద్ భయాందోళనలో ఉన్నాడు. కిడ్నాప్ కేసులో తనకు వీడియోకాన్ఫరెన్స్‌లో శిక్ష విధించాలని ఆయన కోరాడు. తాను సబర్మతి జైలు విడిచి పెట్టబోనని అన్నాడు. తనను బయటకు తీసుకెళ్లితే.. వారు యాక్సిడెంట్ ప్లాన్ చేసి చంపేస్తారని, లేదంటే ఎన్‌కౌంటర్ చేసి అంతమొందిస్తారని పేర్కొన్నాడు.
వందకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న అతీఖ్ అహ్మద్ గతంలో ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో శిక్ష పొందుతున్నాడు. ఆయనను ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసులో శిక్ష వేయడానికి యూపీలోని కోర్టుకు తీసుకెళ్లాల్సి ఉన్నది. కానీ, తాను యూపీకి రాబోనని చెబుతున్నాడు.
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో అతీఖ్ అహ్మద్ ప్రధాన నిందితుడు. అదే హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉమేశ్ పాల్ ఉన్నాడు. ఉమేశ్ పాల్‌ను కూడా 2005లో కిడ్నాప్ చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఈ కిడ్నాప్ కేసులో చివరి వాదనల రోజున ఫిబ్రవరి 24వ తేదీన ఆయనను హత్య చేశారు. ఈ హత్య వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సీరియస్ అయ్యారు. ఆ క్రైమ్ సిండికేట్‌ను నాశనం చేస్తానని అన్నారు.
అనంతరం, ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న, ఉమేశ్ పాల్ పై తొలి బుల్లెట్ పేల్చిన విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్‌ను మార్చి 14వ తేదీన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.
దీంతో అతీఖ్ అహ్మద్ కూడా తనను ఎన్‌కౌంటర్ చేసి చంపేస్తారని, యూపీకి తాను రానని అంటున్నాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన గుజరాత్ జైలులో ఉంటున్నాడు. ఆయనను యూపీ పోలీసుల కస్టడీలోకి తీసుకోవాలంటే సుప్రీం కోర్టు ఆదేశాలు అవసరం. ప్రొడక్షన్ వారెంట్ ప్రాసెస్‌ను చాలా రహస్యంగా ప్రారంభించారని అతీఖ్ అహ్మద్ లీగల్ టీమ్ వర్గాలు వివరించాయి.
అతీఖ్ అహ్మద్‌ను రోడ్డు మార్గానా సుమారు 30 గంటల ప్రయాణంతో యూపీకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని లీగల్ వర్గాలు తెలిపాయి. కిడ్నాప్ కేసులో వాదనలు విన్నట్టే శిక్షను కూడా వీడియో కాన్ఫరెన్స్‌లోనే విధించాలని కోరాయి. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నాయి.