రాహుల్ గాంధీకి వస్తున్న మద్దతులో విపక్షాల ఐక్యతకు అవకాశాన్ని చూస్తున్న కాంగ్రెస్

By Mahesh KFirst Published Mar 26, 2023, 5:44 PM IST
Highlights

రాహుల్ గాంధీకి ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు పలికారు. ఆయనకు సంఘీభావంగా నిలిచారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ విపక్షాలను ఏకతాటి మీదకు తేవడానికి ఒక అవకాశంగా చూస్తున్నది. ఆ పార్టీ నేతలు పలువురు అలాంటి వ్యాఖ్యలు చేశారు.
 

న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. విపక్షాల ఐక్యత అనే మాట పాతపడిపోయింది, కానీ, కార్యరూపం దాల్చలేదు. విపక్షాల భావజాలాలు, వాటి లక్ష్యాలు, దారుల్లోని బేధాలు వాటిని ఒక చోట చేరకుండా నిలువరిస్తున్నాయి. విపక్షాలన్నీ ఏకమైతేనే కేంద్రంలోని బీజేపీని ఓడించవచ్చునని, ఇలా ఏ పార్టీకి వారే అన్నట్టుగా ఉంటే అది మోడీ ప్రభుత్వానికే బలం అని విశ్లేషకులు, రాజకీయ నేతలూ అన్నారు. కానీ, ప్రతిపక్షాలు ఒక తాటి మీదికి రావడం మాత్రం కల్లే అని అనిపించింది. ఇంతలో రాహుల్ గాంధీ ఇష్యూ చోటుచేసుకోవడంతో ప్రతిపక్షాలన్నీ దాదాపు ఆయనకు మద్దతు పలికాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ మద్దతులో ప్రతిపక్షాల ఐక్యత అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి.

విపక్షాల ఐక్యతకు ఉమ్మడి వేదిక కనిపించడం లేదు. కానీ, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వీటన్నింటికి స్పందించడానికి ఒక ఉమ్మడి అవకాశాన్ని సృష్టించింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేది లేనే లేదని తెగేసి చెప్పిన పార్టీలు కూడా రాహుల్ గాంధీపై వేటు వేయడాన్ని ఖండిచాయి. కొన్ని పార్టీలు పేరు ప్రస్తావించడానికి ఇష్టంలేకున్నా.. ఆ ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఖండనలు చేశాయి. ఎలాగైతేనేం.. విపక్షాలకు ఒక ఉమ్మడి అవకాశం దొరికినట్టయింది. దీన్ని విపక్షాలన్నింటినీ ఏకతాటి మీదికి తేవడానికి ఒక అవకాశంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది.

గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఉండే రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఈ అంశంపై స్పందించారు. దేశం సరైన దిశగా వెళ్లడం లేదని తెలిసిన తర్వాత విపక్ష పార్టీలు అన్నీ ఎందుకు ఒక చోటికి రావడం లేదని సామాన్య ప్రజలు ఆక్రోశిస్తున్నారని అన్నారు. కానీ, ఇప్పుడు వారంతా తమకు మద్దతు ఇస్తున్నారని, అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 

విపక్షాలన్నీ రాహుల్ గాంధీకి మద్దతు తెలుపడం తనకు సంతోషాన్ని ఇస్తున్నదని, ప్రజాస్వామ్యానికి కాపాడటానికి వారు నిలబడటం హర్షణీయం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వివరించారు.

విపక్షాల ఐక్యత అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకుపోవాలని జైరాం రమేశ్ అన్నారు. పార్లమెంటులో ప్రతి రోజూ విపక్షాలను కాంగ్రెస్ అధ్యక్షుడు సమన్వయం చేస్తున్నాడని, పార్లమెంటు బయట కూడా ఇలా చేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.

Also Read: హోటల్‌లో యువ నటి మృతదేహం.. ఆత్మహత్యేనా?.. మరణానికి ముందు ఇన్‌స్టా లైవ్‌లో ఏడుస్తూ... వైరల్ వీడియోలివే!

విపక్షాలన్నీ ఈ ఘటనపై స్పందించి మద్దతు తెలుపడంపై రాహుల్ గాంధీ కూడా నిన్న విలేకరుల సమావేశంలో స్పందించారు. ఇది మంచి పరిణామం అని, తామంతా కలిసి ముందు ముందు పని చేయాల్సి ఉన్నదని అన్నారు.

కాంగ్రెస్ నేతలు ఈ అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏక తాటి మీదికి తేవడానికి ఉపయోగించాలని భావిస్తున్నారు. ఐతే, అది సాధ్యపడుతుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించనుంది.

పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు తర్వాత ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు.

click me!