అర్థరాత్రి వచ్చి చికెన్ రోల్ కావాలని హంగామా.. లేదన్నందుకు హోటల్ కు నిప్పు పెట్టి దారుణం.

By SumaBala BukkaFirst Published Dec 14, 2022, 9:15 AM IST
Highlights

చికెన్ రోల్ అడిగితే లేదన్నారని హోటల్ సిబ్బంది గదికి నిప్పుపెట్టారు దుండగులు. ఈ ఘటన బెంగళూరులో కలకలం రేపింది. 

కర్ణాటక : హోటల్ కి వెళ్తే ఎవరైనా ఏం చేస్తాం.. అక్కడ ఏమున్నాయో చూసి వాటిని ఆర్డర్ ఇస్తాం. ఒకవేళ మనం ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ లేకపోతే.. వేరే ఐటమ్ చెప్తాం. ఇది మామూలుగా జరిగేదే.. కానీ కర్ణాటకలోని బనశంకరిలో తాము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ ఇవ్వలేదని హోటల్ కే నిప్పుపెట్టారు దుండగులు. తాము అడిగిన చికెన్ రోల్ ఇవ్వలేదని విధ్వంసం సృష్టించారు అల్లరిమూక. ఈ ఘటన బెంగళూరు హనుమంత నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ దారుణమైన ఘటన వివరాల్లోకి వెళితే..  హనుమంత నగరలో కుమార్ హోటల్ ఉంది. దీనికి సోమవారం అర్ధరాత్రి దేవరాజ్ అనే రౌడీషీటర్ తన ఇద్దరు అనుచరులతో వెళ్ళాడు.

తాము తినడానికి చికెన్ రోల్ కావాలని ఆర్డర్ చేశారు. అయితే అప్పటికే హోటల్ సమయం ముగిసిపోవడంతో ఆ విషయాన్ని సిబ్బంది వారికి తెలిపారు. ఈ రోజు మెనూలో చికెన్ రోల్ కూడా లేదని.. హోటల్ బంద్ చేస్తున్నామని చెప్పారు. ఆశపడి తినడానికి వస్తే హోటల్ సిబ్బంది చెప్పిన సమాధానం వారికి కోపం తెప్పించింది. దీంతో రౌడీ షీటర్ అతని అనుచరులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి, గొడవపడ్డారు. అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో వారితో వాదించి విసిగిపోయి.. వారిని హోటల్ నుంచి బయటకు నెట్టేశారు సిబ్బంది. అంతకుముందే ఘర్షణలో వారిని చితకబాదారు.

అది రౌడీషీటర్, అతని అనుచరుల కోపాన్ని మరింత పెంచింది.. వెంటనే సమీపంలోని పెట్రోల్ బంకుకి వెళ్లారు.  రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత హోటల్ సిబ్బంది ఉన్న గది మీద పోసి దేవరాజ్ అనుచరులు నిప్పు పెట్టారు. మంటలు వ్యాపించడంతో గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దీంతో వారి ప్రాణాలకు ప్రమాదం ఏమీ జరగలేదు. కానీ హోటల్ తలుపులు కిటికీలు కాలిపోయాయి.  ఈ ఘటన మీద హోటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవరాజ్, గణేష్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. 

బాబోయ్.. మృతదేహంతో రోజుల తరబడి ఇంట్లోనే.. డబ్బులు లేక అంత్యక్రియలు చేయలేదంటూ...

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే బెంగళూరులోనే ఈ జనవరిలో జరిగింది. మామూలుగా బ్యాంకులకు అప్పుకోసం అర్జీ పెట్టుకోవడం.. కొన్నిసార్లు అది రిజెక్ట్ కావడం మామూలే. అన్ని పత్రాలు సరిగా ఉన్నా కొన్నిసార్లు.. చేయి తడిపితే కానీ పని కాదు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం తనకు లోను మంజూరు చేయలేదనే అక్కసుతో వసీం అక్రమ్ ముల్లా అనే వ్యక్తి బ్యాంకుకు నిప్పు పెట్టాడు. కర్ణాటకలోని హావేరి జిల్లా హెడిగొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. రట్టిహళ్లికి చెందిన నిందితుడు కెనరాబ్యాంకులో లోన్ కోసం మేనేజర్ ను కలిశాడు. అయితే, కావలసిన పత్రాలు లేకపోవడంతో  లోన్ రాదని మేనేజర్ తెలిపారు.

దీంతో కోపం పెంచుకున్నవసీం అక్రమ్ ముల్లా బైటికి వెళ్లి పెట్రోల్ క్యాన్ తో వచ్చాడు. బ్యాంకులో పెట్రోల్ చల్లి, నిప్పంటించి పరారయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది, ఖాతాదారులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతను వారికి చిక్కకుండా.. వారు తనను పట్టుకోకుండా తన దగ్గరున్న కత్తితో బెదిరించాడు. చివరికి చాలా ప్రయత్నం మీద అతన్ని పట్టుకుని.. స్థానికులు దేహశుద్ధి చేశారు.  పోలీసులకు అప్పగించారు. మంటల విషయం వెంటనే గమనించి.. ఆర్పేలోపే బ్యాంకులోని కంప్యూటర్లు, ఇతర వస్తువులు, కొన్ని కీలక పత్రాలు మంటల్లో కాలిపోయాయి. 

నగదు, నగలు భద్రంగా ఉన్నాయని వాటికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన వెనుక బ్యాంకు మాజీ అధికారి ఒకరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

click me!