ఆట ఇప్పుడే మొదలైంది, 2024లో జేడీయూ అంతం .. కావాలంటే రాసిస్తా : తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Jan 28, 2024, 7:52 PM IST

జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూటమికి షాకిచ్చి.. ఎన్డీయేలో చేరి, తొమ్మిదోసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. ఆట ఇప్పుడే మొదలైందని, తాను ఏం చెబుతానో అదే చేస్తానని ఆయన తెలిపారు. 


బీహార్‌లో మహాఘట్‌బంధన్ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూటమికి షాకిచ్చి.. ఎన్డీయేలో చేరి, తొమ్మిదోసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. 2024తో జేడీయూ అంతం కాబోతోందని, కావాలంటే రాసిస్తానని... నితీష్‌‌కు దార్శనికత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ అలసిపోయిన సీఎం అని.. ఆయన కోసం తామెంతో చేశామని తేజస్వీ అన్నారు. పర్యాటకం, ఐటీ, క్రీడా రంగాల్లో కొత్త విధానాలు తీసుకొచ్చామని.. బీజేపీ జేడీయూ పాలనలో చేయలేని ఎన్నో మంచి పనుల్ని తాము కేవలం 17 నెలల్లో చేశామని ఆయన స్పష్టం చేశారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో తనలో కోపం గానీ, పగ గానీ లేవని.. మహాఘట్‌బంధన్‌తోనే ఆర్జేడీ కొనసాగుతుందని తేజస్వీ యాదవ్ ప్రకటించారు. జేడీయూని తీసుకెళ్లినందుకు బీజేపీకి కృతజ్ఞతలు అంటూ ఆయన సెటైర్లు వేశారు. ప్రజలు తమ వైపే వున్నారని.. తాము వారి వైపే వుంటామని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఆట ఇప్పుడే మొదలైందని, తాను ఏం చెబుతానో అదే చేస్తానని ఆయన తెలిపారు. 

Latest Videos

అంతకుముందు బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మొత్తంగా జేడీయూ ,  బీజేపీల నుంచి ముగ్గురు, హిందూస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్‌లు కొత్త ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. బీజేపీ , ఎల్జేపీ ఇతర పక్షాల మద్ధతుతో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది తొమ్మిదోసారి. 

ఇకపోతే.. బీహార్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 243 . ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి 75 మంది , బీజేపీకి 74, జేడీయూకు 43 మంది ఎమ్మెల్యేల బలం వుంది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాల్సి వుండటంతో జేడీయూ ఒకసారి బీజేపీ మద్ధతుతో తర్వాత ఆర్జేడీ సపోర్ట్‌తో అధికారాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర, దేశ స్థాయిలో రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. సీఎం పదవి తన చేజారిపోకుండా వ్యూహాలు రచిస్తూ చాణుక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సీఎం నితీష్ కుమార్. 

click me!